సస్పెండైన ఐపీఎస్ అధికారి సునీల్ కి షాక్: బెనిఫిట్స్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వానికి భార్య లేఖ
- ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆపాలని కోరిన భార్య
- భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు
- పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి, కొనసాగనున్న విచారణలు
- వివిధ ఆరోపణలతో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సునీల్ కుమార్
వయఃపరిమితి కారణంగా సునీల్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రభుత్వానికి ఒక పిటిషన్ సమర్పించారు. తమ మధ్య వైవాహిక వివాదాలు ఉన్నాయని, తన భర్తపై గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలు ఉన్నాయని అరుణ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయమై 2017 జూన్‌లోనే కేసు నమోదైనట్లు ఆమె వివరించారు. ఒకవేళ ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తే, తన జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, సునీల్ కుమార్ జూన్ 30న పదవీ విరమణ చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆయనపై ఉన్న క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ కేసులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) నిబంధనల ప్రకారం, ఈ విచారణల తుది ఫలితాలను బట్టి ఆయన పెన్షన్, ఇతర ప్రయోజనాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సునీల్ కుమార్.. అప్పట్లో ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే కారణంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.