ఫిఫా వరల్డ్‌ కప్‌: ఓటమి తర్వాత జపాన్‌ ఆటగాళ్లు చేసిన పని చూసి ప్రపంచం ఫిదా!

FIFA World Cup World impressed by what Japan players did after defeat
  • బ్రెజిల్‌ చేతిలో 2-1తో జపాన్‌ ఓటమి
  • తొలి అర్ధభాగంలో ఫస్ట్‌ గోల్‌తో జపాన్‌ ఆధిక్యం
  • కాసెమిరో, మార్టినెల్లి గోల్స్‌తో బ్రెజిల్‌ విజయం
  • మ్యాచ్‌ తర్వాత అభిమానులకు జపాన్‌ జట్టు వంగి కృతజ్ఞతలు
  • ముందుండి ధన్యవాదాలు తెలిపిన కోచ్‌ మోరియాసు 
  • చప్పట్లతో జట్టును అభినందించిన అభిమానులు
క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమిని ఎలా స్వీకరిస్తారన్నదే జట్టుకు గుర్తింపు తీసుకొస్తుంది. ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత జపాన్‌ జట్టు చూపిన వినయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

బ్రెజిల్‌తో జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 32 మ్యాచ్‌లో జపాన్‌ చివరి క్షణంలో 2-1 తేడాతో ఓడిపోయింది. తొలి అర్ధభాగంలో కైషు సానో చేసిన గోల్‌తో జపాన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. చక్కటి డిఫెన్స్‌తో బ్రెజిల్‌ను చాలా సేపు నిలువరించింది. అయితే రెండో అర్ధభాగంలో కాసెమిరో గోల్‌ కొట్టి సమం చేశాడు. మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లేలా కనిపించిన వేళ.. ఇంజరీ టైమ్‌ చివరి నిమిషంలో గాబ్రియెల్‌ మార్టినెల్లి గోల్‌ కొట్టడంతో బ్రెజిల్‌ విజయం సాధించింది.

మ్యాచ్‌ ముగిసిన వెంటనే జపాన్‌ ప్రధాన కోచ్‌ హజిమే మోరియాసు ఆటగాళ్లందరినీ మైదానం మధ్యకు పిలిచారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. తర్వాత జట్టును వెంట తీసుకుని స్టేడియంలో ఉన్న జపాన్‌ అభిమానుల దగ్గరకు వెళ్లారు. అక్కడ కోచ్‌ ముందుగా తలవంచి నమస్కరించగా.. ఆటగాళ్లంతా అదే విధంగా అభిమానులకు వంగి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచకప్‌ అంతా తమకు అండగా నిలిచిన అభిమానులకు వారు చెప్పిన ప్రత్యేక ధన్యవాదాలు అవి.

ఈ దృశ్యాన్ని చూసిన జపాన్‌ అభిమానులు చప్పట్లతో జట్టును అభినందించారు. ఓడినా జట్టు పోరాట స్ఫూర్తి తగ్గలేదని ప్రశంసించారు. సోషల్‌ మీడియాలో కూడా ఈ ఘటన వైరల్‌ అయింది. స్కోరు కంటే సంస్కారం గొప్పదని, ఓటమిలోనూ గౌరవాన్ని ఎలా నిలబెట్టుకోవాలో జపాన్‌ మరోసారి ప్రపంచానికి చూపించిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

జపాన్‌కు ప్రపంచకప్‌ నాకౌట్‌ దశలో తొలి విజయం కోసం ఎదురుచూపులు ఇంకా కొనసాగుతున్నా.. ఈసారి కూడా ఆ జట్టు ప్రదర్శించిన ఆటతీరు, ప్రత్యర్థిపై చివరి వరకు పోరాడిన తీరు, అభిమానులకు తెలిపిన గౌరవం ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానుల మనసులు గెలుచుకుంది.
Japan National Football Team
FIFA World Cup
Hajime Moriyasu
Japan vs Brazil
Football sportsmanship
Japan fans bow

More Telugu News