కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ కేసు: 35 ఏళ్ల తర్వాత సంచలన మలుపు!
- సరళా భట్ హత్య కేసులో ఎస్‌ఐఏ ఛార్జ్‌షీట్
- నిందితుడిగా జేకేఎల్‌ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్
- కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర
- శ్రీనగర్ ప్రత్యేక కోర్టుకు 737 పేజీల నివేదిక
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 1990 ఏప్రిల్ 18న శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌కేఐఎంఎస్) సమీపంలో నర్స్ సరళా భట్‌ను ఉగ్రవాదులు అపహరించారు. ఆ తర్వాత ఆమెను శారీరక హింసకు గురిచేసి, శ్రీనగర్ మాల్‌బాగ్‌లోని ఒమర్ కాలనీలో ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్చి అతి క్రూరంగా హత్య చేశారు. అప్పట్లో ఉగ్రవాద సంస్థలు సృష్టించిన బీభత్సం, భయాందోళనల కారణంగా సాక్షులు ఎవరూ ముందుకు రాకపోవడంతో దశాబ్దాలుగా ఈ కేసు ఒక మిస్టరీగానే ఉండిపోయింది.
అయితే, 2024 మార్చి 18న జమ్మూకశ్మీర్ డీజీపీ ఆదేశాల మేరకు ఈ కేసు ఎస్‌ఐఏ చేతుల్లోకి వచ్చింది. 35 ఏళ్లు గడిచినప్పటికీ, దర్యాప్తు అధికారులు ఎంతో శ్రమించి సాంకేతికంగా, శాస్త్రీయంగా ఆధారాలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలు, స్వతంత్ర ప్రత్యక్ష సాక్షుల ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా నాటి ఘటన క్రమాన్ని విజయవంతంగా పునర్నిర్మించారు.
ఈ దర్యాప్తులో తేలిందేంటంటే.. సరళా భట్ హత్య అనేది ఏదో అకస్మాత్తుగా జరిగిన వ్యక్తిగత దాడి కాదు. కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్లను బలవంతంగా తరిమేయడానికి, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించడానికి జేకేఎల్‌ఎఫ్ అగ్ర నాయకత్వం పక్కా వ్యూహంతో రచించిన ఒక పెద్ద ఉగ్రవాద కుట్రలో భాగమని ఆధారాలతో ఎస్‌ఐఏ నిర్ధారించింది. నాటి జేకేఎల్‌ఎఫ్ చీఫ్ కమాండర్ యాసిన్ మాలిక్‌తో పాటు ఖుర్షీద్ అహ్మద్ చాల్కూ, అబ్దుల్ హమీద్ షేక్, మహ్మద్ యూసుఫ్ సోఫి అలియాస్ ఇద్రీస్, గులాం మహ్మద్ తప్లూలు ఈ అపహరణ, హత్యకు ప్లాన్ చేశారని తేలింది.
నిందితులలో అబ్దుల్ హమీద్ షేక్, మహ్మద్ యూసుఫ్ సోఫి, గులాం మహ్మద్ తప్లూలు ఇప్పటికే మరణించగా, ప్రధాన సూత్రధారి యాసిన్ మాలిక్ ప్రస్తుతం మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘటనలో తుపాకి ట్రిగ్గర్ నొక్కిన మరో ఉగ్రవాది ఖుర్షీద్ అహ్మద్ చాల్కూ ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు పారిపోయాడని భావిస్తున్నారు. అతడిపై ప్రకటనల జారీతో కూడిన చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.