టాటా మోటార్స్‌ భారీ లక్ష్యం.. ఏడాదికి 10 లక్షల వాణిజ్య వాహనాల విక్రయాలు!

Tata Motors sets massive target of selling 10 lakh commercial vehicles annually
  • నియంత్రణ సంస్థల ఆమోద దశలో ఐవెకో గ్రూప్ కొనుగోలు ప్రక్రియ
  • ఇది పూర్తయితే ఏడాదికి 10 లక్షల వాహన విక్రయాలు టాటా లక్ష్యం
  • ప్రపంచంలోని తొలి 4 వాణిజ్య వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలవాలన్నదే లక్ష్యమని ప్రకటన
ప్రపంచ వాణిజ్య వాహనాల మార్కెట్లో అగ్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్న టాటా మోటార్స్‌ భారీ ప్రణాళికను ప్రకటించింది. ఇటలీకి చెందిన ఐవెకో గ్రూప్‌ కొనుగోలు పూర్తయిన తర్వాత ఏడాదికి 10 లక్షలకు పైగా వాణిజ్య వాహనాలు విక్రయించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు.

టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ విభాగం వార్షిక సర్వసభ్య సమావేశంలో చంద్రశేఖరన్‌ మాట్లాడారు. ఐవెకో కొనుగోలుతో ప్రారంభంలోనే రెండు కంపెనీలవి కలిపి వార్షిక విక్రయాలు సుమారు ఆరు లక్షల వాహనాలకు చేరుకుంటాయని చెప్పారు. ఆ తర్వాత 10 లక్షల మార్కును సులభంగా దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈ కొనుగోలు ప్రక్రియ ప్రస్తుతం నియంత్రణ సంస్థల ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డీల్‌ పూర్తయ్యే అవకాశముందని కంపెనీ భావిస్తోంది. ఈ ఒప్పందంతో టాటా మోటార్స్‌కు అత్యాధునిక పవర్‌ట్రెయిన్‌, కొత్త తరం టెక్నాలజీలు, మెరుగైన ఉత్పత్తుల శ్రేణి, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత బలం లభిస్తుందని చంద్రశేఖరన్‌ చెప్పారు.

రెండు కంపెనీల సామర్థ్యాలను సమర్థంగా వినియోగించి ప్రపంచంలోని తొలి నాలుగు వాణిజ్య వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ కార్యకలాపాలను మరింత విస్తరించి, ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు తెలిపారు.

వాణిజ్య వాహనాల విభాగాన్ని విభజించి ప్రత్యేకంగా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేసిన తర్వాత టాటా మోటార్స్‌ అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ట్రక్‌ వ్యాపారంపై ఆధారాన్ని తగ్గిస్తూ, విడిభాగాలు, సేవల వంటి స్థిర ఆదాయంపై దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగాల ఆదాయం 18.2 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ 50 శాతానికి పైగా వృద్ధి నమోదైంది.
Tata Motors
N Chandrasekaran
Iveco Group acquisition
Commercial vehicle sales target
Tata Sons
Global commercial vehicle market

More Telugu News