పాక్‌కు మళ్లీ ఎఫ్‌ఏటీఎఫ్ గండం.. ఉగ్రవాదుల వీడియోలతో ఉచ్చు బిగించనున్న భారత్
- ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టేందుకు భారత్ సన్నద్ధం
- ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్న వీడియోలనే ఆధారాలుగా చూపేందుకు సిద్ధం
- లష్కరే తోయిబాకు రాజకీయ పార్టీ ముసుగు వేసిన పాక్
- గతంలో జమాత్ ఉద్ దవాను స్వచ్ఛంద సంస్థగా ప్రచారం
- అక్టోబర్‌లో పారిస్‌లో జరగనున్న ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశంపై ఉత్కంఠ
లష్కరే తోయిబాకు కొత్త రాజకీయ రూపం
గతంలో లష్కరే తోయిబా (LeT) ఆర్థిక విభాగమైన జమాత్ ఉద్ దవా (JuD)కు స్వచ్ఛంద సేవా సంస్థ ముసుగు తొడిగి పాకిస్థాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సరిగ్గా ఇదే కారణంతో ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చిక్కుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో కొత్త ఎత్తుగడకు పాల్పడుతోంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) అనే రాజకీయ పార్టీని పాక్ ప్రోత్సహిస్తోంది. ఈ పార్టీ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాదులకు రాజకీయ నాయకులనే ముద్ర వేసి, వారిని చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల సందర్భంగా ఈ విషయం స్పష్టంగా బయటపడింది. ఈ కార్యక్రమానికి పీఎంఎంఎల్ ఇస్లామాబాద్ విభాగం అధ్యక్షుడు హాజరయ్యారు. అతనితో పాటు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్, మరో కీలక ఉగ్రవాది సైఫుల్లా కసౌరీ కూడా కనిపించారు. ఇలాంటి బహిరంగ కార్యక్రమాల్లో ఉగ్రవాదులు పాల్గొనడం ద్వారా, వారిని రాజకీయ నాయకులుగా చిత్రీకరించి అంతర్జాతీయ ఏజెన్సీల నిఘా నుంచి తప్పించాలనేది పాకిస్థాన్ వ్యూహమని ఓ సీనియర్ అధికారి వివరించారు.
ఆధారాలు సేకరిస్తున్న భారత్
పీఎంఎంఎల్, లష్కరే తోయిబాకు సంబంధించిన సోషల్ మీడియా ఛానళ్లలో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోలన్నింటినీ భారత్ సేకరిస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్ హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ పాకిస్థాన్ ఉగ్రవాదులను బహిరంగంగా ప్రోత్సహిస్తోందని చెప్పడానికి ఇవి బలమైన ఆధారాలని అధికారులు చెబుతున్నారు. పాక్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన అధికారులు సైతం ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవుతూ, వాటిని చట్టబద్ధమైన కార్యక్రమాలుగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారని వారు తెలిపారు.
ఈ ఏడాది అక్టోబర్ 26 నుంచి 30 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్‌ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత్ ప్రవేశపెట్టనున్న ఆధారాలతో పాకిస్థాన్ మరోసారి ఇరుకున పడటం ఖాయమని, తన చర్యలను సమర్థించుకోవడం చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్ ఎత్తుగడలను అంతర్జాతీయ వేదికలపై పదేపదే బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందని భారత అధికారులు స్పష్టం చేస్తున్నారు.