కేతన్ హత్య కేసు: షాపింగ్ పేరుతో డబ్బు తీసుకొని ప్రియుడికి.. మూడేళ్ల తర్వాత పెళ్లి.. పెద్ద ప్లానే!
- పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ నుంచి రూ.కోటి తీసుకున్న సియా
- ఆ డబ్బును ప్రియుడు చేతన్‌కు ఇచ్చినట్లు పోలీసుల సమాచారం
- మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరి ప్రణాళిక
- హత్యకు 34 నిమిషాల ముందు ఇద్దరి మధ్య రహస్య కాల్
- కారుకు బదులుగా స్కూటర్‌పై ఘటనాస్థలానికి చేరుకున్న చేతన్
చేతన్ వ్యాపారం, కెరీర్‌ను నిలబెట్టేందుకు ఆ డబ్బును ఉపయోగించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను ఆర్థికంగా బలపడేందుకు కనీసం మూడేళ్లు పడుతుందని సియాకు చేతన్ చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే కేతన్ హత్య తర్వాత సియా మూడేళ్ల పాటు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా సద్దుమణిగిన తర్వాతే వివాహం చేసుకోవాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
జూన్ 18న లోహగఢ్ కోట వద్ద జరిగిన హత్యకు ముందే ఇద్దరూ పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సియా నీళ్లు తాగుతున్నట్లు లేదా షూ లేస్ కట్టుకుంటున్నట్లు కూర్చోవడం సంకేతంగా నిర్ణయించారు. ఆ సంకేతం కనిపించగానే చేతన్ వెనుక నుంచి వచ్చి కేతన్‌ను లోయలోకి తోసేయాలని ప్లాన్ చేశారు. కేతన్ కిందపడే సమయంలో సియాను పట్టుకునే అవకాశం లేకుండా ఉండేందుకే ఇలా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
హత్యకు కేవలం 34 నిమిషాల ముందు సియా తన ప్రియుడు చేతన్‌తో రహస్యంగా మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల్లో గుర్తించారు. అదే హత్యకు తుది సంకేతమని పోలీసులు భావిస్తున్నారు. టోల్‌ప్లాజాల్లో గుర్తించకుండా ఉండేందుకు చేతన్ కారుకు బదులుగా స్కూటర్‌పై పుణే నుంచి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.