రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం.. సింగపూర్ తో కలిసి పనిచేస్తామన్న మంత్రి లోకేశ్
- సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో మంత్రి లోకేశ్ భేటీ
- ఏపీ, సింగపూర్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చలు
- రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను, పారదర్శక విధానాలను వివరించిన మంత్రి
- ఏపీ అభివృద్ధిని, పెట్టుబడుల ఆకర్షణలో పురోగతిని ప్రశంసించిన సింగపూర్ ప్రతినిధి
- విద్య, సాంకేతిక రంగాల్లో సహకారంపైనా ఇరువురి మధ్య ప్రస్తావన
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని సింగపూర్ ప్రతినిధికి వివరించారు. ప్రజాప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పెట్టుబడులను క్షేత్రస్థాయికి తీసుకురావడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. "రాష్ట్రంలో 750 పరిశ్రమల ఏర్పాటు వివిధ దశల్లో ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధి కోసం 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం" అని లోకేశ్ పేర్కొన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీకి వచ్చాయని గుర్తుచేశారు.
గతంతో పోలిస్తే రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయని, పాత సమస్యలను పరిష్కరించి పారదర్శక విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. "సింగపూర్ తో బలమైన భాగస్వామ్యాన్ని మేము కోరుకుంటున్నాం" అని లోకేశ్ స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ లో జరిపిన అధ్యయన యాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, తన రష్యా పర్యటన విశేషాలను కూడా ఆయన పంచుకున్నారు.
మంత్రి లోకేశ్ వివరణపై సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ సానుకూలంగా స్పందించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ప్రశంసించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అభినందనలు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు సింగపూర్ లో పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారత్-సింగపూర్ మధ్య సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఎడ్గర్ పాంగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.





