రీసెర్చ్ పేపర్ల ఉపసంహరణ: ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానం
- ఉపసంహరణలో గ్లోబల్ టాప్ 10 జాబితాలో ఆరు భారత యూనివర్సిటీలు
- చెన్నై అన్నా యూనివర్సిటీకి తొలి స్థానం, హైదరాబాద్ జేఎన్‌టీయూకు ఐదో ర్యాంక్
- నాణ్యతను పక్కనపెట్టడమే ప్రధాన కారణం
ఈ నివేదిక ప్రకారం, 2025లో చైనా 1,701 పరిశోధన పత్రాల ఉపసంహరణతో ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ 887 రిట్రాక్షన్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో మన దేశం వాటా కేవలం 5 శాతమే అయినప్పటికీ, ఉపసంహరణల్లో మాత్రం 21 శాతం వాటాను కలిగి ఉండటం పరిశోధనల నాణ్యతా ప్రమాణాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈ జాబితాలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీ 161 రిట్రాక్షన్లతో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో నిలిచింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ (160), సవీత ఇన్‌స్టిట్యూట్ (159) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 104 రిట్రాక్షన్లతో ఐదో స్థానంలో నిలవగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 98 ఉపసంహరణలతో ఆరో స్థానంలో నిలిచింది.
నాణ్యత ప్రమాణాలను విస్మరించి పరిశోధన పత్రాలను ప్రచురించడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశోధనలో లోపాలు, అవాస్తవిక ఫలితాలు, కృత్రిమ మేధ (ఏఐ) వాడకం వంటి కారణాల వల్ల పలు జర్నళ్లు ఈ పత్రాలను తిరస్కరించాయి. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, 2025 నుంచి నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో రిట్రాక్షన్లకు పెనాల్టీలు విధించడం వంటి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.