శంషాబాద్‌లో చిరుత భయానికి తెర.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని స్కూల్‌లో చిరుత పులి కలకలం
- రంగంలోకి దిగి పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు
- అవి చిరుత అడుగులు కావని, అడవి పందివని స్పష్టీకరణ
- అధికారుల ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు
శనివారం ఉదయం విమానాశ్రయ సమీపంలోని జీఎంఆర్ చిన్మయి విద్యాలయ ప్రాంగణంలో కొన్ని జంతువుల పాదముద్రలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖకు సమాచారం అందించారు. దీంతో రంగారెడ్డి జిల్లా అటవీశాఖ బృందం, నెహ్రూ జూలాజికల్ పార్క్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ, "మేము క్షేత్రస్థాయిలో పాదముద్రలను నిశితంగా పరిశీలించాం. అక్కడ రెండు రకాల అడుగులు ఉన్నాయి. వాటిలో ఒకటి అడవి పందికి చెందినది కాగా, మరొకటి పిల్లి జాతికి చెందిన ఇతర జంతువుదిగా గుర్తించాం. అవి కచ్చితంగా చిరుత పులివి కావు" అని వివరించారు.
విమానాశ్రయ నర్సరీ వద్ద జంతువుల కదలికలు ఉన్నాయన్న సమాచారం అందిన వెంటనే వన్యప్రాణి నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకున్నామని, తనిఖీల్లో చిరుత ఆనవాళ్లు ఎక్కడా లభించలేదని విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో చిరుత సంచారం నమోదైన నేపథ్యంలో, తాజా ఘటనపై అధికారులు త్వరితగతిన స్పందించి వాస్తవాలను వెల్లడించడంతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగిపోయాయి.