అంగారకుడిపై ‘చిరుతపులి మచ్చలు’.. ఒకప్పటి జీవరాశి ఉనికికి బలమైన ఆధారాలు!
- జెజెరో క్రేటర్‌లోని ‘చేయావా ఫాల్స్’ అనే రాయిపై వింత ఆనవాళ్లు
- ‘చేయావా ఫాల్స్’ అనే రాయిపై కనుగొన్న పర్సవరెన్స్ రోవర్
- భూమిపై సూక్ష్మజీవుల ఉనికిని సూచించే సేంద్రియ అణువులు, ‘చిరుతపులి మచ్చలు’ వంటి ఆకృతులు
- సుమారు 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై జీవం ఉండొచ్చన్న శాస్త్రవేత్తలు
- ‘మార్స్ శాంపిల్ రిటర్న్’ మిషన్ ద్వారా ఈ రాతి నమూనాలను భూమికి తీసుకురానున్న నాసా
శాస్త్రవేత్తలు ‘చేయావా ఫాల్స్’గా నామకరణం చేసిన ఒక రాయిని పర్సవరెన్స్ రోవర్ గతేడాది సేకరించింది. ఈ నమూనాను విశ్లేషించగా.. అందులో వింతైన చుక్కల ఆకృతులు, సేంద్రియ అణువులు, ఖనిజ లవణాలు ఉన్నట్లు తేలింది. సాధారణంగా భూమిపై ఇటువంటి ఆకృతులు, రసాయన కలయికలు సూక్ష్మజీవుల వల్ల మాత్రమే ఏర్పడతాయి.
ముఖ్యంగా ఈ రాయిపై ‘చిరుతపులి మచ్చలు’ వంటి ఆకృతులను రోవర్ రికార్డ్ చేసింది. సుమారు 3.5 బిలియన్ల సంవత్సరాల క్రితం అంగారకుడి ఉపరితలంపై ద్రవరూపంలో నీరు ప్రవహించిన సమయంలో.. అక్కడ జీవరాశి మనుగడకు అవసరమైన రసాయన చర్యలు జరిగాయనడానికి ఇవి సంకేతాలు కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, జీవులు లేకపోయినా కేవలం రసాయన, భౌగోళిక ప్రక్రియల వల్ల కూడా ఇటువంటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి దీనిని ఇప్పుడే నూటికి నూరు శాతం ‘జీవం వుండేది’ అని కచ్చితంగా చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దీనిపై తుది నిర్ధారణకు రావాలంటే పర్సవరెన్స్ రోవర్ సేకరిస్తున్న ఈ రాతి నమూనాలను భూమికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం నాసా తన అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ‘మార్స్ శాంపిల్ రిటర్న్’ మిషన్‌పై వేగంగా పనిచేస్తోంది. ఈ నమూనాలను భూమిపై ఉన్న అత్యాధునిక ల్యాబొరేటరీలలో పరీక్షించిన తర్వాత మార్స్‌పై జీవం ఉనికిపై ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఏదేమైనప్పటికీ, మానవాళికి భవిష్యత్తులో ‘రెండో ఇల్లుగా’ మారబోతోందని భావిస్తున్న రెడ్ ప్లానెట్‌పై లభించిన ఈ తాజా ఆధారాలు అంతరిక్ష పరిశోధనల్లో ఒక కీలక మైలురాయిగా నిలిచాయి.