‘రావు బహదూర్’ చూసేందుకు ఆగలేకపోతున్నా: మహేశ్ బాబు
- ‘రావు బహదూర్’పై మహేశ్ బాబు ప్రశంసలు
- ‘ఆలోచనల్లోకి చొచ్చుకెళ్లే సినిమా’ అంటూ వ్యాఖ్య
- సత్యదేవ్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు
- దీపా థామస్ పాత్రకు మంచి మార్కులు
- బీటీఎస్ వీడియోతో పెరిగిన అంచనాలు
- జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల
తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించాడు. ‘‘ఇది కాలర్ పట్టుకుని కుదిపేసే సినిమా మాత్రమే కాదు.. మనసులోకి, ఆలోచనల్లోకి చొచ్చుకెళ్లే సినిమా. వింతగా, అందంగా, తీవ్ర భావోద్వేగాలతో నిండిన కథ’’ అని పేర్కొన్నారు.
అలాగే దర్శకుడు వెంకటేశ్ మాహా సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉందని, హీరో సత్యదేవ్ ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని ప్రశంసించారు. కథానాయిక దీపా థామస్ నటన కూడా ఎంతో సహజంగా ఉందని కొనియాడారు. చిత్ర బృందమంతా అద్భుతంగా పనిచేసిందని తెలిపారు.
ఇటీవల విడుదలైన ‘ఇంటూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్’ అనే బీటీఎస్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఈ వీడియోలో సత్యదేవ్ చేసిన పాత్ర రూపాంతరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక మేకప్, కాంటాక్ట్ లెన్సులు, రాజసంగా కనిపించే దుస్తులతో ఆయన పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించారు.
భారీ సెట్లు, పురాతన నేపథ్యం, యాక్షన్ సన్నివేశాల కోసం చేసిన సన్నాహాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. గత యుగంలోని రాచరిక ప్రపంచం, దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు, వారసత్వ కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జూన్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.