మోదీ 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారు: జగ్గారెడ్డి

Jagga Reddy says Modi owes 24 crore jobs to the nation
  • సంగారెడ్డిలో రాహుల్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన జగ్గారెడ్డి దంపతులు
  • రాహుల్ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్న జగ్గారెడ్డి
  • దేశం కోసం మోదీ ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్న

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన మార్క్ పొలిటికల్ కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. సంగారెడ్డి వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జగ్గారెడ్డి, ఆయన భార్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు.


సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, ఇక్రిశాట్, ఐఐటీ హైదరాబాద్ లాంటి జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినవేనని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ కష్టపడి నిర్మించిన ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను... నేటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ లూటీ చేస్తోందని మండిపడ్డారు.


"నెహ్రూ పాలనను బ్రేక్ చేశామని బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ ముత్తాత (నెహ్రూ), నానమ్మ (ఇందిరా గాంధీ), తండ్రి (రాజీవ్ గాంధీ), తల్లి (సోనియా గాంధీ) ఈ దేశం కోసం ఏం త్యాగాలు చేశారో, ఎలాంటి సంస్థలు నిర్మించారో నేను ఆధారాలతో సహా వివరిస్తా. మరి గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ దేశానికి ఏం చేశారో బీజేపీ నేతలు సమాధానం చెబుతారా?" అని సూటిగా ప్రశ్నించారు.


ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని... ఈ లెక్కన దేశ యువతకు ఇప్పటివరకు ఏకంగా 24 కోట్ల ఉద్యోగాలు బాకీ ఉన్నారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. దేశం బాగుపడాలన్నా, నిరుద్యోగం అంతమవ్వాలన్నా రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం ప్రెస్‌మీట్‌లకే పరిమితం కాకుండా.. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల జ్ఞాపకార్థం జగ్గారెడ్డి దంపతులు దాదాపు 350 మంది పాఠశాల చిన్నారులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు.

Go Back to Shorts
Jagga Reddy
Narendra Modi
Rahul Gandhi
Congress Party
Sangareddy
Unemployment

More Telugu News