హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం

  • ప్రొఫెసర్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం
  • వైద్య రంగంలో సేవలకుగాను ప్రతిష్ఠాత్మక ఓబీఈ పురస్కారం
  • కింగ్స్ బర్త్‌డే ఆనర్స్ 2026 జాబితాలో చోటు
  • డయాబెటిస్, ఆరోగ్య అసమానతలపై చేసిన కృషికి గుర్తింపు
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డయాబెటిస్ వైద్య నిపుణుడు, ప్రొఫెసర్ మహమ్మద్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం లభించింది. వైద్య రంగంలో, ముఖ్యంగా మధుమేహ నియంత్రణకు, ఆరోగ్య అసమానతలను తగ్గించడానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక 'ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' (ఓబీఈ) పురస్కారంతో ఆయనను సత్కరించారు. కింగ్స్ బర్త్‌డే ఆనర్స్ 2026 జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు.

వసీం హనీఫ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు. 1995లో యూకేకు వలస వెళ్లిన ఆయన, గత మూడు దశాబ్దాలుగా డయాబెటిస్, ఎండోక్రైనాలజీ రంగాల్లో పరిశోధన, విద్య, వైద్య విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ హాస్పిటల్స్‌లో ప్రొఫెసర్‌గా, 'డయాబెటిస్ యూకే' సంస్థకు క్లినికల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనితో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ , యూరోపియన్ యూనియన్, యూకే పార్లమెంట్‌కు సైతం సలహాదారుగా సేవలు అందిస్తున్నారు.

ఈ పురస్కారంపై ప్రొఫెసర్ హనీఫ్ స్పందిస్తూ, "ఈ గౌరవం దక్కడం చాలా ఆనందంగా ఉంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి జీవితాలను మెరుగుపరచడానికి, సమాజంలో ఆరోగ్య అసమానతలను రూపుమాపడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేశాను. ఇది నా ఒక్కడి విజయం కాదు, నా సహచరులు, పరిశోధకులందరి సమష్టి కృషి ఫలితం" అని తెలిపారు.

Mohammed Wasim Hanif
OBE Award
Diabetes Specialist
Hyderabad Doctor UK
Gandhi Medical College

More Telugu News