ప్రపంచంలోని టాప్-200 విద్యాసంస్థల్లో భారత్ నుంచి మూడే!
- క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 విడుదల
- దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ
- ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానం
- తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు)
- మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్ (170వ ర్యాంకు)
- ప్రపంచంలో ఎంఐటీకి అగ్రస్థానం
భారత్ నుంచి రెండో స్థానంలో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు), మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్ (170వ ర్యాంకు) నిలిచాయి. టాప్-200లో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థలు ఇవి మాత్రమే కావడం గమనార్హం. ఇక ఐఐటీ ఖరగ్‌పూర్ 205వ స్థానం, ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ కాన్పూర్ 221వ స్థానాల్లో నిలిచాయి.
పరిశోధనల ప్రభావం, విద్యా ఖ్యాతి, ఉద్యోగ అవకాశాలు, అంతర్జాతీయ పరిశోధన భాగస్వామ్యాలు, సుస్థిరత వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తారు. ఈ ప్రమాణాల్లో ఐఐటీ ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా పరిశోధనా పత్రాల ప్రస్తావనల (సైటేషన్స్) విభాగంలో అత్యధిక మార్కులు సాధించింది.
భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ యూనివర్సిటీ 332వ స్థానం, ఐఐటీ రూర్కీ 335వ స్థానం, ఐఐటీ గువాహటి 349వ స్థానం దక్కించుకున్నాయి. అన్నా యూనివర్సిటీ, జేఎన్‌యూ, బిట్స్ పిలానీ, వీఐటీ వంటి సంస్థలు కూడా జాబితాలో చోటు సంపాదించాయి.
ప్రపంచ స్థాయిలో మాత్రం అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. వరుసగా 15వ ఏడాది నంబర్‌వన్‌గా నిలిచిన ఎంఐటీకి 100కి 100 స్కోరు లభించింది. రెండో స్థానంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్, అదే స్కోరుతో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నిలిచాయి. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వర్సిటీ వరుస స్థానాల్లో నిలిచాయి.