రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ నాయక్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Raghu Rama Custodial Torture Case High Court Sensational Comments on IPS Sunil Kumar
  • పార్లమెంటుపై దాడి చేసే వారికి, ఎంపీపై దాడి చేసే వారికి తేడా ఏమిటన్న హైకోర్టు
  • రఘురామను టార్చర్ చేయబోతున్నారనే విషయం సునీల్ నాయక్ కు తెలుసని వ్యాఖ్య
  • సునీల్ నాయక్ ఎప్పటిలోగా లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాదికి ప్రశ్న

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఘాటు వ్యాఖ్యలు చేసింది.


విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "దేశ సర్వోన్నత చట్టసభ అయిన పార్లమెంట్‌పై దాడి చేసిన వ్యక్తులకు.. అదే పార్లమెంట్‌లో సభ్యుడిగా (ఎంపీగా) ఉన్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని థర్డ్ డిగ్రీతో దారుణంగా వేధించిన వారికి మధ్య పెద్ద తేడా ఏముంది?" అని జడ్జి సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిపై కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు రావడం అత్యంత తీవ్రమైన విషయమని కోర్టు పేర్కొంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అయి ఉండి... ఇలాంటి అరాచక సంఘటనల్లో భాగస్వామి కాకుండా తనను తాను నియంత్రించుకోవాల్సిన కనీస బాధ్యత లేదా అని నిలదీసింది.


ఎంపీ రఘురామకృష్ణంరాజును వేధింపులకు గురిచేయబోతున్నారనే విషయం సునీల్ కుమార్‌ నాయక్ కు ముందే తెలుసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమికంగా ఆధారాలు కనిపిస్తున్నాయని కోర్టు స్పష్టం చేసింది.


ఒక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ముందస్తు బెయిల్ రక్షణగా మారకూడదని కోర్టు తేల్చిచెప్పింది. సునీల్ కుమార్ నాయక్ తరఫు లాయర్‌ను ఉద్దేశించి ‘మీ క్లయింట్ ఎప్పటిలోగా పోలీసుల ఎదుట సరెండర్ అవుతారు?’ అని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొనసాగిస్తారా? లేక చట్టాన్ని గౌరవించి స్వచ్ఛందంగా వెళ్లి లొంగిపోతారా? అనేది తేల్చుకోవాలని ఆదేశించింది.


హైకోర్టు వ్యాఖ్యలపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ... కోర్టు అడిగిన ప్రశ్నలపై తమ క్లయింట్ తో సంప్రదించి తదుపరి నిర్ణయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తామని చెప్పారు. కేసుకు సంబంధించిన మరికొన్ని కీలక అంశాలను కోర్టు ముందు ఉంచుతామని కోరారు. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి తుది తీర్పు ఇవ్వకుండా, హైకోర్టు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Go Back to Shorts
PV Sunil Kumar
Raghu Rama Krishna Raju
AP High Court
Custodial Torture Case
Anticipatory Bail
Andhra Pradesh Police

More Telugu News