కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ!

Honeybee death after stinging a story of sacrifice in nature
  • చేపల గాలంలా వెనక్కి తిరిగి వుండే ముల్లు కొక్కేలు 
  • కుట్టినప్పుడు చర్మంలో ఇరుక్కుపోయే ముల్లు 
  • ఎగిరిపోయే సమయంలో ముల్లు, విష సంచి ఊడిపోతాయి
  • కొన్ని అంతర్గత అవయవాలు కూడా ఊడివస్తాయి
  • తీవ్ర గాయాల కారణంగా మరణించే తేనెటీగ 
  • తన గూడులోని ఇతర తేనెటీగలను రక్షించడం కోసమే ప్రాణత్యాగం
పాము బతికి ఉంటే ఎన్ని సార్లైనా కాటేయగలదు. తేలు కూడా అంతే. కానీ తేనెటీగ మాత్రం ఒక్కసారి మనిషిని కుడితే ప్రాణాన్ని కోల్పోతుంది. ప్రకృతిలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయాల్లో ఇదొకటి. శత్రువును గాయపరచడం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టే ఈ వ్యవస్థ వెనుక ఆసక్తికరమైన శాస్త్రీయ కారణం ఉంది.

తేనెటీగ శరీరంలోని ముల్లు (స్టింగర్‌) సాధారణ సూదిలా ఉండదు. దానిపై కంటికి కనిపించని చిన్న కొక్కేలు ఉంటాయి. ఇవి చేపల గాలంలా వెనక్కి తిరిగి ఉంటాయి. తేనెటీగ మరో పురుగును కుట్టినప్పుడు పెద్దగా సమస్య ఉండదు. కానీ మనిషి లేదా మందమైన చర్మం ఉన్న ఇతర జంతువులను కుట్టినప్పుడు ఈ కొక్కేలు చర్మంలో బలంగా ఇరుక్కుపోతాయి.

కుట్టిన తర్వాత తేనెటీగ ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ముల్లు బయటకు రాదు. అయినా తేనెటీగ అలాగే బలంగా లాగుతుంది. దీంతో ముల్లుతో పాటు విష సంచి, కండరాలు, పొట్ట భాగంలోని కొన్ని అంతర్గత అవయవాలు శరీరం నుంచి విడిపోతాయి. దీంతో తేనెటీగకు తీవ్ర గాయాలు అవుతాయి. కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే అది మరణిస్తుంది.

అయితే ప్రకృతి ఎందుకు ఇలాంటి లోపభూయిష్టమైన ఆయుధాన్ని తేనెటీగకు ఇచ్చింది? దీనికి సమాధానం వాటి జీవన విధానంలో దాగి ఉంది. తేనెటీగలు ఒంటరిగా జీవించవు. వేల సంఖ్యలో కాలనీలుగా జీవిస్తాయి. ఒక వర్కర్‌ తేనెటీగ ప్రాణం కంటే మొత్తం గూడు భద్రతే వాటికి ముఖ్యమైనది. గూడుపై దాడి చేసే శత్రువును అడ్డుకునేందుకు ఒక తేనెటీగ చనిపోయినా, వేలాది తేనెటీగలు, ముఖ్యంగా రాణి తేనెటీగ సురక్షితంగా ఉంటే కాలనీ మనుగడ కొనసాగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని ‘స్వీయ త్యాగ రక్షణ వ్యవస్థ’గా అభివర్ణిస్తారు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తేనెటీగ ఎగిరిపోయిన తర్వాత కూడా చర్మంలో మిగిలిపోయిన ముల్లు కొంతసేపు విషాన్ని విడుదల చేస్తూనే ఉంటుంది. అందుకే తేనెటీగ కుట్టిన వెంటనే ముల్లును జాగ్రత్తగా తొలగించాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే అన్ని తేనెటీగలు ఇలా చనిపోవు. తేనె తయారు చేసే హనీ బీస్‌లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఇతర తేనెటీగ జాతులు, కందిరీగలు పలుసార్లు కుట్టినా బతికే ఉంటాయి. వాటి ముళ్లు అంతగా ఇరుక్కుపోవు.
Advertisement
Honeybee
Bee sting
Worker bees
Bee stinger anatomy
Nature sacrifice
Bee colony protection

More Telugu News