వరల్డ్ కప్ 2026: జర్మనీ టీమ్ క్యాంప్‌లో విషసర్పం కలకలం!
- వరల్డ్ కప్ 2026 కోసం అమెరికాలో జర్మనీ ఫుట్‌బాల్ జట్టు
- వారి క్యాంప్‌లో విషపూరిత కాపర్‌హెడ్ పాము ప్రత్యక్షం
- జాగ్రత్తగా ఉండాలంటూ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ హెచ్చరిక
- ఇతర జట్లకు కూడా స్థానిక వన్యప్రాణుల నుంచి ఇబ్బందులు
"నిన్న మా శిబిరం వద్ద ఒక పామును గుర్తించాం. అది అత్యంత విషపూరితమైన 'కాపర్‌హెడ్; పాము అని సిబ్బంది తెలిపారు. అది కాటు వేస్తే తక్షణమే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. ప్రాణాపాయం లేకపోయినా, అది ఎంతో ప్రమాదకరమైనది. ఈ ప్రాంతంలో మేము చాలా అప్రమత్తంగా ఉండాలి" అని కిమ్మిచ్ వివరించారు. తమ స్వదేశమైన జర్మనీలో ఇలాంటి వన్యప్రాణుల ముప్పు చాలా తక్కువగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో కాపర్‌హెడ్ పాములు అధికంగా కనిపిస్తాయి. ఇవి ఎండుటాకుల రంగులో కలిసిపోయి ఉండటంతో వీటిని గుర్తించడం కష్టతరం. వీటి కాటు వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, సకాలంలో వైద్యం అందితే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ ఘటనలో జర్మనీ జట్టు సభ్యులకు గానీ, సహాయక సిబ్బందికి గానీ ఎటువంటి హాని కలగలేదు.
కాగా, ఇదే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా శాన్ డియాగోలో శిక్షణ పొందుతున్న స్విట్జర్లాండ్ జట్టుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అక్కడ రాటిల్‌స్నేక్ పాముల సంచారం ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాలను "స్నేక్ ఏరియాస్"గా ప్రకటించి ఆటగాళ్లను హెచ్చరించారు. అమెరికాలోని భిన్నమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా యూరప్ జట్లు ఇటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం జర్మనీ జట్టు గ్రూప్ దశలో కురాకో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్ జట్లతో తలపడనుంది.