రోజూ మఖానా తింటే కొవ్వు కరుగుతుందా? నిపుణులు చెబుతోంది ఇదే..!

Does eating Makhana daily burn fat Here is what experts say
  • మఖానా నేరుగా కొవ్వు కరిగించదు
  • కానీ బరువు తగ్గడంలో సాయపడుతుంది
  • ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో ఆకలి నియంత్రణ
  • రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది
  • యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో జీవక్రియలకు మేలు
  • నూనె తక్కువగా వేసి, పరిమిత మోతాదులో తీసుకుంటే మంచిది
బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ కోసం వెతుకుతుంటారు. అలాంటి వాటిలో ఇటీవల ఎక్కువగా ప్రాచుర్యం పొందింది మఖానా (ఫాక్స్ నట్స్‌). తక్కువ క్యాలరీలు, మంచి పోషకాలు ఉండటంతో చాలామంది దీన్ని డైట్‌లో చేర్చుకుంటున్నారు. అయితే రోజూ మఖానా తింటే నిజంగానే శరీరంలోని కొవ్వు కరుగుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. నిపుణుల ప్రకారం మఖానా నేరుగా కొవ్వును కరిగించకపోయినా బరువు తగ్గే ప్రక్రియకు మాత్రం బాగా సాయపడుతుంది.

మఖానాలో ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మధ్య మధ్యలో జంక్‌ ఫుడ్‌ తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే తక్కువ క్యాలరీలతోనే ఆకలి నియంత్రణలో ఉండటంతో రోజువారీ క్యాలరీల వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయ స్నాక్‌గా ఉపయోగపడుతుంది.

ఇక రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచడంలో కూడా మఖానా సాయపడుతుంది. తీపి పదార్థాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగి శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కానీ మఖానా నెమ్మదిగా జీర్ణమవ్వడం వల్ల శక్తి క్రమంగా విడుదలవుతుంది. దీంతో ఆకలి తగ్గి, బరువు నియంత్రణ సులభమవుతుంది.

అంతేకాకుండా మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత ప్రొటీన్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి. అయితే మఖానాను ఎక్కువ నూనె లేదా నెయ్యితో వేయించి తింటే ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి స్వల్పంగా వేయించి, పరిమిత మోతాదులో తీసుకుంటేనే బరువు తగ్గే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Makhana
Fox Nuts
Weight Loss
Fat Burn
Healthy Snacks
Nutrition Benefits

More Telugu News