ఆసుప‌త్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు!

Poisoning husband in hospital heart attack drama exposed by lovers social media post
  • కర్ణాటకలో మాజీ సైనికుడి మృతి ప్రమాదం కాదన్న పోలీసులు
  • రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకం
  • ఆసుప‌త్రిలో సెలైన్ ద్వారా విషం ఎక్కించి, గుండెపోటుగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
  • నిందితుడి సోషల్ మీడియా పోస్టుతో అనుమానం 
  • విచారణ చేపట్టగా అసలు కుట్ర వెలుగులోకి 
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఒక మాజీ సైనికుడి మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. సాధారణ బైక్ ప్రమాదంగా భావించిన ఈ ఘటన రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి పన్నిన దారుణ హత్యగా పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ కేసులో మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు వైద్యులు, ఫోరెన్సిక్ సిబ్బంది సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ప్రమాదంతో మొదలై హత్యగా తేలింది
మాజీ సైనికుడు సందీప్ మంజర్గి మార్చి 13న బైక్‌పై నుంచి జారిపడి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో అతని భార్య సుమ మంజర్గి, మొదట హుక్కేరి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఘటప్రభలోని జేజీ ఆసుపత్రికి మార్చింది. అయితే, మార్చి 15న సందీప్ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బీఐఎంఎస్‌ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక ఫోరెన్సిక్ నివేదికలో కూడా ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, గుండెపోటు వల్లే మరణం సంభవించిందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా పోస్టుతో తిరిగిన కథ
ప్రమాదంలో తీవ్ర గాయాలు కాకపోవడం ఆరోగ్యంగా ఉన్న సందీప్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంపై పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో సుమ ప్రియుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుండలీక్ దొంబార్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ కేసును కీలక మలుపు తిప్పింది. "ప్రమాదానికి గురైన వ్యక్తి అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు?" అంటూ తనకు అంతా తెలిసినట్లుగా అతను పోస్ట్ పెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు కుట్ర మొత్తం బయటపడింది.

రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం దారుణం
పోలీసుల కథనం ప్రకారం సందీప్, పుండలీక్ గతంలో కలిసి హోటల్ వ్యాపారం చేశారు. ఈ క్రమంలోనే సందీప్ భార్య సుమతో పుండలీక్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే సమయంలో సందీప్ పేరు మీద మూడు వేర్వేరు కంపెనీల నుంచి సుమారు రూ.2 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. ఆ డబ్బును కాజేయాలనే దురుద్దేశంతోనే ఈ హత్యకు పథకం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమ, పుండలీక్ కలిసి సెలైన్ బాటిల్ ద్వారా విషాన్ని, నిద్రమాత్రలను ఇచ్చి సందీప్‌ను హత్య చేశారు. అనంతరం ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు వైద్య, ఫోరెన్సిక్ సిబ్బందికి రూ.3 లక్షలకు పైగా లంచం ఇచ్చి నివేదికలను తారుమారు చేయించారు. నిందితుల నుంచి విషం సీసాలు, సిరంజిలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సందీప్ భార్య సుమ, ప్రియుడు పుండలీక్‌తో పాటు డాక్టర్ బసవరాజ్, ఎఫ్‌డీఏ అధికారి అశోక్, ఎఫ్‌ఎస్‌ఎల్ క్లర్క్ అప్పాసాహెబ్ సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.

ఇటీవల తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ కూడా భర్తను హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బు పొందాలని చూసిన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Sandeep Manjargi
Suma Manjargi
Pundalik Dombar
Belagavi murder case
Insurance fraud murder
Karnataka crime news

More Telugu News