మీరు ఫోన్ లో స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు... కారణం డోపమైన్!
- సోషల్ మీడియా ఫీడ్స్ ఒక స్లాట్ మెషిన్లా పనిచేస్తాయి
- ప్రతీ స్వైప్‌కు మెదడులో డోపమైన్ విడుదల.. అదే అసలు కిక్
- నిరంతర స్క్రోలింగ్ వల్ల ఏకాగ్రత, సహనం తగ్గుతున్నాయన్న నిపుణులు
- నెగటివ్ వార్తలను ఎక్కువగా చూడటం వల్ల పెరిగే ఒత్తిడి
- స్క్రోలింగ్ అలవాటు మెదడు పనితీరును మార్చేస్తోందని వెల్లడి
సోషల్ మీడియా ఫీడ్లు సాధారణంగా పుస్తకాలు లేదా సినిమాల మాదిరిగా నిర్దిష్ట ముగింపు లేకుండా, నిరంతరం కొనసాగేలా రూపొందించబడ్డాయి. ఇది 'తదుపరి అంశం ఏమిటి?' అనే ఉత్సుకతను వినియోగదారుల్లో నిరంతరం రేకెత్తిస్తాయి. మానసిక నిపుణులు ఈ స్థితిని 'స్లాట్ మెషిన్' అనుభవంతో పోలుస్తున్నారు. స్లాట్ మెషిన్లో ఎప్పుడు జాక్‌పాట్ వస్తుందో తెలియని ఆశతో ఎలాగైతే ప్లేయర్లు ఆకర్షితులవుతారో, సోషల్ మీడియాలో కూడా మనకు నచ్చే పోస్ట్ లేదా వీడియో ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి మనల్ని స్క్రోలింగ్ చేస్తూనే ఉండేలా ప్రేరేపిస్తుంది.
ప్రతీ స్వైప్‌కు మెదడులో 'డోపమైన్' అనే రసాయనం స్వల్ప మోతాదులో విడుదల అవుతుంది. ఇది కేవలం సంతోషాన్ని మాత్రమే కాకుండా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ప్రేరణను, తీవ్రమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ డోపమైన్ విడుదల కోసం మన మెదడు పదేపదే స్క్రోలింగ్ చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రక్రియ కాలక్రమేణా ఒక వ్యసనపూరిత అలవాటుగా మారిపోతుంది.
వేగవంతమైన కంటెంట్‌ను నిరంతరం వీక్షించడం వల్ల మెదడు సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పుస్తకాలు చదవడం లేదా లోతుగా ఆలోచించడం వంటి ఓపికతో కూడిన పనులపై ఏకాగ్రత దెబ్బతింటుంది. అదేవిధంగా, ప్రతికూల వార్తలను అతిగా అనుసరించడం (డూమ్ స్క్రోలింగ్) వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని, ఇది ఒక విష వలయంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని అతి వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.