చాయ్ మాస్టర్లకు సీఈవో రేంజ్ ప్యాకేజీ.. కేఫ్ నీలోఫర్ సిబ్బంది జీతాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • ఉద్యోగులకు నెలకు రూ. 5 లక్షల జీతం ఇస్తున్నట్లు ఎండీ శశాంక్ వెల్లడి
  • సాఫ్ట్‌వేర్, సీఈవోల ప్యాకేజీలను మించిన వేతనాలుగా చర్చ
  • రుచి, నాణ్యతే తమ విజయ రహస్యమన్న కేఫ్ యాజమాన్యం
  • ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకోవడమే తమ పాలసీ అని స్పష్టీకరణ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలోఫర్ కేఫ్ వీడియో
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నీలోఫర్ కేఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాలుగా తనదైన రుచితో నగరవాసులను ఆకట్టుకుంటున్న ఈ కేఫ్, ఇప్పుడు తన ఉద్యోగులకు ఇస్తున్న జీతాల విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేఫ్‌లో పనిచేసే సిబ్బందికి నెలకు ఏకంగా రూ. 5 లక్షల వరకు జీతం ఇస్తున్నట్లు వెల్లడి కావడంతో ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ సీఈవోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

పాడ్‌కాస్ట్‌లో బయటపడ్డ అసలు విషయం
నీలోఫర్ కేఫ్ అధినేత బాబూరావు కుమారుడు, కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అనుమల శశాంక్ ఇటీవల ఓ బిజినెస్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కేఫ్ విజయ రహస్యాలను, వ్యాపార వ్యూహాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా ఆయన తమ ఉద్యోగుల జీతభత్యాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "సాధారణంగా ఒక కేఫ్ సిబ్బందికి నెలకు రూ. 50 వేల వరకు జీతం ఇస్తారు. కానీ, మా నీలోఫర్ కేఫ్‌లో ఏడాదికి రూ. 60 లక్షల ప్యాకేజీ, అంటే నెలకు రూ. 5 లక్షల వరకు జీతం తీసుకునే వారు కూడా ఉన్నారు" అని శశాంక్ తెలిపారు.

అంత భారీ జీతాలకు కారణం ఇదే..!
ఒక కేఫ్‌లో పనిచేసే సిబ్బందికి ఇంత భారీ మొత్తంలో జీతాలు ఇవ్వడం వెనుక బలమైన కారణం ఉందని శశాంక్ వివరించారు. "మా నాన్నగారు బాబూరావు ఎప్పుడూ 'కస్టమర్ దేవుడైతే, ఉద్యోగి మా కుటుంబ సభ్యుడు' అని చెబుతుంటారు. మేము ఆ మాటకు కట్టుబడి ఉన్నాం" అని ఆయన అన్నారు. దశాబ్దాలుగా ఒకే రకమైన రుచి, నాణ్యతను అందించడమే నీలోఫర్ కేఫ్ ప్రత్యేకత అని, ఆ రుచికి అలవాటుపడిన కస్టమర్లు వేరే చోటికి వెళ్లరని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రత్యేకమైన రుచిని కాపాడేది తమ దగ్గర పనిచేసే చాయ్, బిస్కట్ తయారీ మాస్టర్లేనని శశాంక్ స్పష్టం చేశారు. వేలాది మంది కస్టమర్ల ఒత్తిడిని తట్టుకుంటూ, రుచిలో ఎలాంటి మార్పు రాకుండా పనిచేసే వారి నైపుణ్యానికి, శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన ఆ మాస్టర్లు కేఫ్ వదిలి వెళ్లకుండా వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామని, అందుకే వారికి కార్పొరేట్ స్థాయి ప్యాకేజీలు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలతో వ్యాపారంలో నాణ్యతను కాపాడటానికి ఉద్యోగుల పాత్ర ఎంత కీలకమో నీలోఫర్ కేఫ్ నిరూపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Cafe Niloufer
Anumula Shashank
Hyderabad Cafe Niloufer Salaries
Chai Master Salary
Niloufer Cafe Tea Master Package
Hyderabad Food News

More Telugu News