కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..!

Is eating cucumber unhealthy Know these facts
  • కీరదోసతో ఆరోగ్యానికి మేలు
  • కొందరికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం
  • చేదు కీరదోస తినొద్దు
  • కొందరికి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం
  • అరుదుగా అలర్జీ రావచ్చు
ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా చాలా మంది కీరదోసకాయను తమ డైట్‌లో చేర్చుకుంటున్నారు. క్యారట్‌, బీట్‌రూట్‌తో పాటు దీన్నీ పచ్చిగా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా తింటున్నారు. 

ఇందులో ఫైబర్‌, నీటి శాతం ఎక్కువగా ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. తరచూ ఏదో ఒకటి తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో క్యాలరీల వినియోగం తగ్గి బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. అయితే కీరదోసకాయ అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

జీర్ణకోశ సమస్యలు
కీరలో ఉండే పీచు పదార్థాలు, సహజ రసాయనాలు కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా జీర్ణకోశం సున్నితంగా ఉండేవారు ఎక్కువ పరిమాణంలో తింటే ఈ ఇబ్బందులు కనిపించే అవకాశం ఉంటుంది.

చేదుగా ఉంటే జాగ్రత్త
కొన్నిసార్లు దోసకాయ సాధారణం కంటే మరీ చేదుగా ఉంటుంది. దీనికి ‘కుకుర్బిటాసిన్స్’ అనే సహజ రసాయనాలే కారణం. స్వల్ప మోతాదులో ఇవి ప్రమాదకరం కాకపోయినా, ఎక్కువగా ఉన్న కీర తింటే వికారం, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చేదుగా అనిపించిన దోసను వెంటనే పారేయడం మంచిది.

ఫుడ్ పాయిజనింగ్‌
ఇతర పచ్చి కూరగాయల్లాగే కీరపై కూడా హానికర బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. సరిగా కడగకుండా లేదా పరిశుభ్రంగా నిల్వ చేయకుండా తింటే ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో విరేచనాలు, జ్వరం, వాంతులు, కడుపు మంట, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

అలర్జీ కూడా రావచ్చు
కీరతో అలర్జీ వచ్చే వారు చాలా తక్కువే. అయినా కొందరిలో నోరు, గొంతులో దురద, పెదవులు లేదా నాలుక వాపు, చర్మంపై దద్దుర్లు, గొంతు మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రమైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

తరచూ మూత్ర విసర్జన
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే అధికంగా తింటే సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన కావచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారికి ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు పాటించడం మంచిది.

ఇలా తింటే సేఫ్‌
కీరదోసకాయ తినే ముందు బాగా కడగాలి. శుభ్రమైన, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. చేదు రుచి ఉన్న కీర తినకూడదు. మితంగా తీసుకోవాలి. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు తొక్క తీసి తింటే మంచిది.
Go Back to Shorts
Cucumber
Health benefits of cucumber
Cucumber side effects
Weight loss diet
Digestive issues
Cucurbitacins

More Telugu News