ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్

Raghava Lawrence clarifies did I compare people to dogs they are like my mother
  • రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్
  • ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం
  • ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్
  • కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తనపై జరుగుతున్న ఓ దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ప్రజలను కుక్కలతో పోల్చానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, తన మాటలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం ఏమిటో వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

ఇటీవల రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే తన రాజకీయ ప్రయాణం మొదలుపెడతానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ఆయన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇదే సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారంటూ ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది.

ఈ వివాదంపై లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. "అందరికీ నమస్కారం. నా ఇటీవలి ప్రెస్ మీట్‌కు సంబంధించి ఒక అపోహను నివృత్తి చేయాలనుకుంటున్నాను. నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అలాంటిది నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం" అని ఆయన పేర్కొన్నారు.

తాను చెప్పిన అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ.. "మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు, అక్కడి పరిసరాలను, ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పాను. అంతేగానీ నేను ఎంతో గౌరవించే, అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడాను" అని స్పష్టం చేశారు.

దయచేసి అందరూ ఆ పూర్తి వీడియోను చూసి, తాను నిజంగా ఏం చెప్పానో అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన వివరణకు మద్దతుగా అసలు వీడియోను కూడా తన పోస్టులో పంచుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశంపై ప్రజాభిప్రాయం కోరుతున్న తరుణంలో ఈ వివాదం చెలరేగడం, దానిపై లారెన్స్ వెంటనే స్పందించి వివరణ ఇవ్వడం జ‌రిగింది.
Go Back to Shorts
Raghava Lawrence
Raghava Lawrence politics
Raghava Lawrence clarification
Viral video controversy
Tamil actor Raghava Lawrence
Raghava Lawrence social media post

More Telugu News