రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్
- వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
- 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్
- ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్‌కు పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఈ దశలో క్రీజులో నిలిచిన గుర్బాజ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వ్యక్తిగత స్కోరు 14 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్న గుర్బాజ్, ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. భారత్‌పై వన్డేల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.
గుర్బాజ్ ధాటికి ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక దశలో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 220 దాటుతుందనిపించింది. అయితే, గుర్బాజ్ ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది. ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ, భారత బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకున్నారు. గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీసి వారికి సహకరించారు. గుర్బాజ్ సెంచరీతో భయపెట్టినా, భారత బౌలర్లు సకాలంలో పుంజుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 200 పరుగుల లోపే పరిమితమైంది.