ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నా.. సోనూ సూద్ భావోద్వేగం!
- వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన నటుడు సోనూ సూద్
- ఈ ప్రయాణం తన పాత రోజులను గుర్తు చేసిందని భావోద్వేగం
- ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నానని వెల్లడి
- భారతీయ రైల్వేల అభివృద్ధి అద్భుతమంటూ ప్రశంసలు
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్న సోనూ సూద్, తన అనుభవాలను వివరించారు. "మేము వందే భారత్‌లో ప్రయాణిస్తున్నాం. రైల్వేల పరంగా ఇది అద్భుతమైన అభివృద్ధి అని చెప్పాలి. ఇక్కడి నాణ్యత, అందించే ఆహారం, సిబ్బంది ప్రవర్తన, వారు చూపించే ప్రేమ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ రైలు ప్రయాణం నాకు నా మొదటి ప్రయాణాన్ని గుర్తు చేసింది. నేను నాగ్‌పూర్‌లో చదువుకుని, నటుడిని కావాలనే కలలతో ముంబైకి బయల్దేరాను" అని తెలిపారు.
తన గతాన్ని గుర్తుచేసుకుంటూ, "అప్పట్లో చాలాసార్లు రిజర్వేషన్ ఉండేది కాదు. పొడవాటి కంప్యూటర్ పేపర్లు మడతపెట్టుకుని రైలు ఎక్కేవాళ్లం. రాత్రి పూట రైలు బోగీల్లోని టాయిలెట్ దగ్గర న్యూస్ పేపర్లు పరుచుకుని పడుకుని సమయం గడిపేవాళ్లం. కానీ, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రైలులో ప్రయాణిస్తుంటే, భారతీయ రైల్వేల నాణ్యత ఎంతగానో పెరిగిందని చెప్పగలను. ఇప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లపై పడుకోవాల్సిన అవసరం లేదు. అంతా చాలా మారింది. మీరు చేస్తున్న ఈ గొప్ప పనులకు ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన పనులు కొనసాగించండి. ఇవన్నీ మన దేశాభివృద్ధికి చాలా ముఖ్యం" అంటూ రైల్వే శాఖను అభినందించారు.
"దేశంలోని కోట్లాది మంది సామాన్యుల రోజువారీ ప్రయాణాన్ని, వారి జీవన నాణ్యతను మెరుగుపరిచినందుకు భారతీయ రైల్వేలకు ధన్యవాదాలు" అని సోనూ సూద్ తన పోస్ట్‌లో రాశారు.
నటి రవీనా టాండన్ కూడా వందే భారత్‌ను మెచ్చుకున్న వైనం
ఇదిలా ఉంటే.. ప్రముఖ నటి రవీనా టాండన్ కూడా వందే భారత్ రైలుపై ప్రశంసలు కురిపించారు. ఆమె విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకుని మరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ప్రభుత్వం చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని ఆమె కొనియాడారు. భారతదేశ ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాల పట్ల గర్వంగా ఉందని తెలిపారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. మొత్తంమీద వందే భారత్ రైళ్లు కేవలం ప్రయాణికులనే కాకుండా, సినీ ప్రముఖుల మన్ననలు కూడా పొందుతూ వార్తల్లో నిలుస్తున్నాయి.