భారతీయ సిబ్బంది నౌకపై దాడి.. అమెరికాకు భారత్‌ మరోసారి గట్టి నిరసన

India lodges strong protest with US over attack on ship with Indian crew
  • 48 గంటల్లో రెండోసారి అమెరికా దౌత్యాధికారిని పిలిపించిన భారత్‌
  • ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి
  • గత దాడుల్లో ముగ్గురు భారతీయ నావికుల మృతి
  • చర్చలు, దౌత్య పరిష్కారాల ద్వారానే ఉద్రిక్తతలు తగ్గాలని స్పష్టం
ఒమన్‌ తీరంలో భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు కొనసాగుతుండటంతో అమెరికా తీరు పట్ల భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గత 48 గంటల్లో రెండోసారి ఢిల్లీలోని అమెరికా సీనియర్‌ దౌత్యాధికారిని విదేశాంగ శాఖ పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది. నిన్న జరిగిన ఘటనలో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్న ఓ వాణిజ్య నౌక దాడికి గురికావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

అమెరికా అధికారి జేసన్‌ మీక్స్‌ను పిలిపించి భారత విదేశాంగ శాఖ తమ ఆందోళనలను నేరుగా తెలియజేసింది. గత దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒమన్‌ తీర ప్రాంతంలో నాలుగు రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం లక్ష్యంగా చేసుకుందని భారత ప్రభుత్వం వెల్లడించింది. 

భారత నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు. సెట్టెబెల్లో నౌకపై దాడి జరిగిన వెంటనే అమెరికా అధికారులకు గట్టి నిరసన తెలిపినట్లు వెల్లడించారు. ఇలాంటి దాడులు వెంటనే ఆగాలని, సమస్యల పరిష్కారానికి యుద్ధం కంటే చర్చలు, దౌత్య మార్గాలే సరైనవని భారత్‌ స్పష్టం చేసిందన్నారు.

ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకాయానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని భారత్‌ కోరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు అన్ని పక్షాలు సంభాషణల బాట పట్టాలని ఢిల్లీ పిలుపునిచ్చింది.
Go Back to Shorts
India
US Navy
Oman Coast
Indian Sailors
Ministry of External Affairs
Strait of Hormuz

More Telugu News