డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని విజ్ఞప్తి

  • అట్రాసిటీ కేసు పెట్టే వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని రిక్వెస్ట్ 
  • మతం మారిన వారు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ
  • సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరిన రఘురామ
ఏపీలో ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేస్తే, సదరు ఫిర్యాదుదారుడి ఎస్సీ హోదాను తప్పనిసరిగా పరిశీలించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏపీ డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన డీజీపీకి ఒక లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకే ఈ చర్యలు అవసరమని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పును రఘురామ తన లేఖలో ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని ఆయన గుర్తు చేశారు. అందువల్ల అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు, ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు గానీ, లేదా నమోదు చేసిన వెంటనే గానీ ఫిర్యాదుదారుడి కుల హోదాను క్షుణ్ణంగా ధ్రువీకరించుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మతం మారి ఎస్సీ హోదా కోల్పోయిన వారి నుంచి అట్రాసిటీ కేసులను స్వీకరించకుండా చూడాలని రఘురామ డీజీపీని కోరారు.

గతంలో ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్లపైనా ఫిర్యాదు
కాగా, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల కాలంలో డీజీపీకి లేఖలు రాయడం ఇది రెండోసారి. గతంలో రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్ల వల్ల శబ్ద కాలుష్యంపై ఆయన ఫిర్యాదు చేశారు. లౌడ్‌స్పీకర్ల అధిక శబ్దం వల్ల విద్యార్థులు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి, పబ్లిక్ న్యూసెన్స్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సౌండ్ సిస్టమ్‌లను స్వాధీనం చేసుకోవాలని ఆ లేఖలో సూచించారు. రాష్ట్రమంతటా నిబంధనలు ఒకే విధంగా అమలయ్యేలా చూడాలని ఆయన కోరారు.

Raghu Rama Krishna Raju
Andhra Pradesh DGP
SC ST Atrocity Act
SC status verification
Supreme Court conversion ruling
AP Deputy Speaker

More Telugu News