‘రష్యా చమురు కొనమన్నది అమెరికాయే’.. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఫైర్‌

  • ధర, లభ్యత ఆధారంగానే కొనుగోళ్ల స్పష్టీకరణ
  • టారిఫ్‌లు విధించి మళ్లీ ఎత్తివేసిందంటూ అమెరికాపై ఫైర్‌
  • యూరప్‌ ఆయుధాలపై కూడా జైశంకర్‌ విమర్శలు
  • నైతికత పేరుతో విమర్శలు సరికాదన్న మంత్రి
 రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తున్న పాశ్చాత్య దేశాలపై విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురు కొనుగోలు చేయాలని భారత్‌ను స్వయంగా అమెరికానే కోరిందని వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లో ధరలు అదుపులో ఉండాలంటే రష్యా చమురు కొనాలని అప్పట్లో అగ్రరాజ్యం సూచించిందని చెప్పారు.

ఫిన్లాండ్‌ పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై భారత్‌ మరీ సానుభూతి చూపుతోందని, ఎక్కువగా రష్యా చమురునే కొనుగోలు చేస్తోందని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన గట్టిగా బదులిచ్చారు. తాను చమురు కొనేటప్పుడు ధర, లభ్యత మాత్రమే చూస్తానని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత అమెరికా సహా పాశ్చాత్య దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాయి. దీంతో యూరప్‌ దేశాలు పశ్చిమాసియా దేశాల చమురును ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించాయి. అదే సమయంలో భారత్‌కు అందుబాటులో ఉన్న పెద్ద సరఫరాదారు రష్యానే అయిందని జైశంకర్‌ వివరించారు. పరిస్థితులే భారత్‌ను ఆ దిశగా నడిపించాయని చెప్పారు.

రష్యా చమురు విషయంలో అమెరికా వైఖరిని కూడా ఆయన ప్రశ్నించారు. ఓవైపు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై టారిఫ్‌లు విధించారని తర్వాత వాటినే ఎత్తివేశారని గుర్తుచేశారు. ఇందులో గొప్ప సూత్రాలు ఏమీ లేవని, దీనికి నైతికత ముసుగు వేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రభుత్వం భారత వస్తువులపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోందంటూ విధించిన 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. అయితే ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి పెరగడంతో ఆ ఆంక్షలను అమెరికా సడలించింది.

యూరప్‌ దేశాలపై కూడా జైశంకర్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌పై దాడులకు ఉపయోగించే ఆయుధాలను యూరప్‌ దేశాలు ఎన్నో ఏళ్లుగా విక్రయిస్తున్నాయని చెప్పారు. భారత ఆయుధాలతో యూరప్‌లోని ఏ దేశంపైనా దాడులు జరగలేదని స్పష్టం చేశారు. కానీ యూరప్‌ నుంచి వెళ్లిన ఆయుధాలు భారత్‌పైకి మాత్రం దూసుకొస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.

S Jaishankar
Russian Oil
Western Hypocrisy
India US Relations
Global Energy Market
Finland Visit

More Telugu News