తన అధికారిక నివాసంగా 160 ఏళ్ల నాటి భవనాన్ని ఎంచుకున్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్

DK Shivakumar chooses 160 year old building as official residence
  • కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త నివాసం ఖరారు
  • సంప్రదాయానికి భిన్నంగా చారిత్రక కుమారకృప బంగ్లాను ఎంపిక
  • మాజీ సీఎం సిద్ధరామయ్య కావేరి బంగ్లాలోనే కొనసాగింపు
  • వాస్తు ప్రకారమే డీకే ఈ బంగ్లాను ఎంచుకున్నారని ప్రచారం
  • ప్రస్తుతం బంగ్లాలో వేగంగా పునరుద్ధరణ పనులు
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన అధికారిక నివాసం విషయంలో సంప్రదాయానికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రుల కోసం కేటాయించే కృష్ణ, కావేరి, అనుగ్రహ వంటి అధికారిక బంగ్లాలకు బదులుగా, 160 ఏళ్ల సుదీర్ఘ చారిత్రక నేపథ్యం కలిగిన 'కుమారకృప' బంగ్లాను తన నివాసంగా, కార్యాలయంగా ఆయన ఎంపిక చేసుకున్నారు.

ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'కావేరి' బంగ్లాలోనే నివాసం ఉంటుండటంతో, ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. బెంగళూరులోని అత్యంత పురాతన కట్టడాల్లో ఒకటిగా పేరొందిన కుమారకృప బంగ్లాను 19వ శతాబ్దంలో దివాన్ కే. శేషాద్రి అయ్యర్ హయాంలో నిర్మించారు. 12 విశాలమైన గదులు, భారీ హాల్స్, వంటగది వంటి సదుపాయాలు ఉన్న ఈ భవనాన్ని దశాబ్దాలుగా స్టేట్ గెస్ట్ హౌస్‌గా వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం ప్రజాపనుల శాఖ ఈ బంగ్లాలో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ పనులు, పెయింటింగ్ వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. టేకు చెక్కతో రూపొందించిన తలుపులు, కిటికీలు, క్యాబినెట్ల వంటి పురాతన నిర్మాణ శైలి ఏమాత్రం దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ బంగ్లా తూర్పు ముఖంగా ఉండటం కూడా డీకే శివకుమార్ నిర్ణయానికి ప్రధాన కారణమని సంబంధిత వర్గాల సమాచారం. వాస్తుపై ఆయనకు ఉన్న దృఢమైన విశ్వాసమే ఇందుకు నేపథ్యం. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ ఆయన తూర్పు ముఖంగానే నిలబడటం గమనార్హం.
Go Back to Shorts
DK Shivakumar
Kumara Krupa Bungalow
Karnataka CM Official Residence
Bengaluru Heritage Buildings

More Telugu News