వారం రోజుల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. ప్రపంచ కుబేరుడికి భారీ ఎదురుదెబ్బ!

  • ఒరాకిల్‌ షేర్ల పతన ప్రభావం
  • ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో రెండు నుంచి ఐదో స్థానానికి
  • ఏఐ షేర్లపై పెట్టుబడిదారుల అప్రమత్తత
  • కంపెనీ త్రైమాసిక ఫలితాల ముందు మార్కెట్‌ ఆందోళన
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం వారం రోజుల్లోనే ఆయన వ్యక్తిగత సంపద 47 బిలియన్‌ డాలర్లకు పైగా కరిగిపోయింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.4 లక్షల కోట్లకు సమానం. ఒరాకిల్‌ షేర్ల ధరలు వరుసగా పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్స్‌ జాబితా ప్రకారం జూన్‌ 2న లారీ ఎల్లిసన్‌ సంపద 296 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం అది 249.7 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. దీంతో ప్రపంచ ధనవంతుల జాబితాలో రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారారు. ఈ నష్టానికి ప్రధాన కారణం ఒరాకిల్‌ షేర్ల పతనమే. గత వారం రోజుల్లో కంపెనీ షేర్లు సుమారు 17 శాతం క్షీణించాయి. మంగళవారం ఒక్కరోజే 4 శాతానికి పైగా పడిపోయాయి. ఒరాకిల్‌లో ఎల్లిసన్‌కు దాదాపు 41 శాతం వాటా ఉండటంతో షేర్‌ ధరల తగ్గుదల నేరుగా ఆయన సంపదపై ప్రభావం చూపింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఎన్వీడియా, యాపిల్‌, ఏఎండీ, మైక్రాన్‌ వంటి ప్రముఖ టెక్‌ కంపెనీల షేర్లు కూడా ఇటీవల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒరాకిల్‌ త్రైమాసిక ఫలితాలను జూన్‌ 10న ప్రకటించనుంది. కంపెనీ ఆదాయం, లాభాలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నప్పటికీ పెట్టుబడిదారులు కంపెనీ భవిష్యత్‌ ఆర్డర్లపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఒరాకిల్‌ వద్ద భారీ స్థాయిలో ఆర్డర్లు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

గత కొన్నేళ్లుగా ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగాలపై పెరిగిన ఆశలతో లారీ ఎల్లిసన్‌ సంపద రికార్డు స్థాయికి చేరింది. అయితే ఇటీవల ఏఐ షేర్లపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో ఒరాకిల్‌ షేర్లు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 41 శాతం వరకు క్షీణించాయి.

Larry Ellison
Oracle
Net Worth Loss
Forbes Billionaires List
AI Tech Stocks
Stock Market

More Telugu News