దేశాన్ని కాంగ్రెస్‌ అగాధంలోకి నెట్టింది: మోదీ

  • సుదీర్ఘకాలం ప్రధానిగా మోదీ రికార్డు
  • ఈ సందర్భంగా ఎన్‌డీయే సమావేశంలో కీలక ప్రసంగం
  • ‘హిందూ గ్రోత్‌ రేట్‌ కాదు.. కాంగ్రెస్‌ గ్రోత్‌ రేట్‌’ అని విమర్శ
  • 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని వెల్లడి
  • వికసిత భారత్‌ ఇప్పుడు 140 కోట్ల కల అని ధీమా
  • 2014లో ఆశ.. ఇప్పుడు ఆత్మవిశ్వాసమన్న మోదీ
భారత చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును అధిగమించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌డీయే కూటమి సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ఈ ఘనత తన వ్యక్తిగత విజయమేమీ కాదని, ఎన్‌డీయే కుటుంబం సాధించిన ఉమ్మడి విజయమని పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, 2014 తర్వాత దేశంలో చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావించారు. ఆయన ప్రసంగంలోని కీలక అంశాలు..

• నెహ్రూ రికార్డును అధిగమించడం తన జీవితంలో ప్రత్యేక ఘట్టమని మోదీ అన్నారు. ఇంతకాలం ఎన్నికైన ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

• ఈ విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా చూడడం లేదన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు, కార్యకర్తలు, కోట్లాది ప్రజల సహకారంతోనే ఈ ప్రయాణం సాధ్యమైందని పేర్కొన్నారు.

• దేశ ప్రజల రాజకీయ పరిణతి వల్లే స్థిర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. 2014కు ముందు దేశం అస్థిరత, అనిశ్చితి కారణంగా నష్టపోయిందని వ్యాఖ్యానించారు.

• కాంగ్రెస్‌ దేశాన్ని అవినీతి, విధానపరమైన వైఫల్యాలు, నిరాశలోకి నెట్టిందని ఆరోపించారు. అభివృద్ధి నెమ్మదిగా సాగడాన్ని ‘హిందూ గ్రోత్‌ రేట్‌’గా పిలవడం తప్పని, దాన్ని ‘కాంగ్రెస్‌ గ్రోత్‌ రేట్‌’గా పిలవాలని అన్నారు.

• గత 12 ఏళ్లలో 25 కోట్ల మందికిపైగా పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఇది ప్రభుత్వ విధానాలు సరైన దిశలో ఉన్నాయనే విషయాన్ని నిరూపిస్తోందన్నారు.

• వికసిత భారత్‌ లక్ష్యం ఇప్పుడు కేవలం ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు. దేశ ప్రజలందరి కలగా, సంకల్పంగా అది మారిందని పేర్కొన్నారు.

• మౌలిక వసతుల అభివృద్ధిలో భారీ పురోగతి సాధించినట్లు వివరించారు. 2014లో 74 విమానాశ్రయాలు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 160కి చేరిందని చెప్పారు.

• ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో సేవలు, రక్షణ ఎగుమతులు, డిజిటల్‌ లావాదేవీల్లో దేశం గణనీయ పురోగతి సాధించిందని మోదీ పేర్కొన్నారు.

• మొబైల్‌ ఫోన్‌ తయారీ, సౌర విద్యుత్‌ ఉత్పత్తి, సెమీకండక్టర్‌ రంగాల్లో భారత్‌ ప్రపంచ స్థాయిలో ముందుకు వెళ్తోందని తెలిపారు.

• యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి ప్రజల ఆశయాలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి పరుగులో ఎవరూ వెనుకబడొద్దనే ఉద్దేశంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు.

Narendra Modi
Congress
NDA Meeting
Jawaharlal Nehru Record
Viksit Bharat
Indian Infrastructure Growth

More Telugu News