కరెంట్ కోతలపై ముంబై మహిళ వినూత్న నిరసన.. తలగడ పట్టుకుని విద్యుత్ ఆఫీసుకు!
- తీవ్రమైన ఉక్కపోతతో రాత్రంతా నిద్రలేక ఆవేదన చెందిన ఇల్లాలు
- కరెంటు ఆఫీసులోనే నిద్రపోతానని భీష్మించుకున్న వైనం
- అధికారుల ముందే కన్నీరు పెట్టుకుంటూ నిలదీసిన మహిళ వీడియో వైరల్
నవీ ముంబైలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు ముందస్తు సమాచారం లేకుండా రాత్రి సమయాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో రాత్రంతా ఉక్కపోతతో నిద్రలేక, పిల్లలు, వృద్ధులు పడుతున్న ఇబ్బందులను చూసి సదరు మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో నిద్రపోయే పరిస్థితి లేకపోవడంతో "ఇక నేను కరెంట్ ఆఫీసులోనే పడుకుంటాను" అంటూ చేతిలో దిండు పట్టుకుని అధికారుల ముందుకు వెళ్ళింది.
కార్యాలయంలో అధికారులను నిలదీస్తూ ఆమె కన్నీరు పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. "రాత్రంతా కరెంట్ తీసేస్తే మేము ఎలా నిద్రపోవాలి? బిల్లులు మాత్రం కరెక్ట్‌గా వసూలు చేస్తారు కదా?" అంటూ ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వినూత్న నిరసన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రతి సామాన్యుడి బాధను ఈ మహిళ ప్రతిబింబించిందని, పెరుగుతున్న ఎండా కాలంలో విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని కామెంట్లు పెడుతున్నారు.