కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా .. చింతకాయల విజయ్ రాజకీయ ప్రస్థానం ఇదిగో!

Chinthakayala Vijay political journey from party worker to TDP Rajya Sabha candidate
  • టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్ ఎంపిక
  • కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా వెల్లడి
  • వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసులు, వేధింపులు ఎదుర్కొన్న విజయ్
  • సోషల్ మీడియా, క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గట్టిగా పోరాడిన యువనేత
  • విధేయత, పోరాట పటిమకు చంద్రబాబు పెద్దపీట వేశారని పార్టీ వర్గాల భావన
తెలుగుదేశం పార్టీలో యువతకు, విధేయతకు, పోరాట పటిమకు ఎల్లప్పుడూ పెద్దపీట ఉంటుందని మరోసారి నిరూపితమైంది. యువనేత, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కు అధినేత చంద్రబాబు రాజ్యసభ టికెట్ కేటాయించడం తెలిసిందే. కేవలం పదవి ఇవ్వడమే కాదు, పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని పార్టీ శ్రేణులకు పంపారు. 

2019 నుంచి 2024 మధ్య కాలంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులను ఎదుర్కొన్నా వెరవకుండా, పార్టీ తరఫున గట్టిగా నిలబడినందుకే ఈ ఉన్నత గౌరవం దక్కిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన యువనాయకుడు చింతకాయల విజయ్. క్షేత్రస్థాయి పోరాటాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయాలకు జోడించడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీకి నమ్మకమైన సైనికుడిగా ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

ఉన్నత విద్య నుంచి ప్రజాక్షేత్రంలోకి..

రాజకీయాల్లో రాణించాలంటే ప్రపంచస్థాయి పరిజ్ఞానం అవసరమని బలంగా నమ్మిన విజయ్, తన విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి 'మాస్టర్స్ ఇన్ పొలిటికల్ మేనేజ్‌మెంట్', పుణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి 'మాస్టర్స్ ఇన్ పొలిటికల్ గవర్నెన్స్' పట్టాలు పొందారు. జేఎన్‌టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీ.టెక్ పూర్తిచేశారు. తన ఉన్నత విద్యా పరిజ్ఞానాన్ని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తున్నారు. వైట్ హౌస్‌లో పాలసీ మేకింగ్‌పై ఇంటర్న్‌షిప్ చేయడం ఆయన దార్శనికతకు నిదర్శనం.

పాదయాత్రల నుంచి సోషల్ మీడియా వరకు..

2009లో 'యూత్ ఫర్ బాబు' పాదయాత్రతో మొదలైన ఆయన క్రియాశీల రాజకీయ ప్రస్థానం, పార్టీ చేపట్టిన ప్రతి కీలక కార్యక్రమంలోనూ కొనసాగింది.  చంద్రబాబు నాయుడు చేపట్టిన 'మీ కోసం పాదయాత్ర', నారా లోకేష్ చారిత్రాత్మక 'యువగళం పాదయాత్ర'లో యువతను సమీకరించడంలో విజయ్ కీలక పాత్ర పోషించారు. కరవు ప్రాంత రైతుల కోసం 250 కిలోమీటర్ల పాదయాత్రకు నాయకత్వం వహించి వారి సమస్యలను వెలుగులోకి తెచ్చారు.

క్లిష్ట సమయంలో పార్టీకి అండగా..

2019 నుంచి 2024 మధ్య, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ ముందువరుసలో నిలిచారు. అప్పటి ప్రభుత్వం తనపై, తన కుటుంబంపై సీఐడీ కేసులు పెట్టినా, ఆస్తులను ధ్వంసం చేసినా వెనకడుగు వేయలేదు. సోషల్ మీడియా వేదికగా బలమైన 'సోషల్ మీడియా ఆర్మీ'ని నిర్మించి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, పార్టీ వాణిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తూ, క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో 'మేలుకో మహిళా' పేరుతో 10,000 మందితో నిర్వహించిన కార్యక్రమం, స్థానికంగా పార్టీ గెలుపునకు పునాది వేసింది.

ప్రజాసేవలోనూ ముందుండి..

రాజకీయాలకే పరిమితం కాకుండా, చింతకాయల విజయ్ సామాజిక సేవలోనూ తనదైన శైలిలో పనిచేస్తున్నారు. తాను స్థాపించిన 'అన్నపూర్ణ అక్షయపాత్ర ఫౌండేషన్' ద్వారా లక్షలాది మందికి భోజన సదుపాయం కల్పించారు. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. 'డయాగ్నోస్టిక్స్ ఆన్ వీల్స్' కార్యక్రమంతో ప్రజల వద్దకే వైద్య పరీక్షలను తీసుకెళ్తున్నారు. గిరిజన గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 'సోలార్ ట్రీ' ప్రాజెక్ట్ ఆయన సృజనాత్మక సేవాదృక్పథానికి నిదర్శనం.

సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి (ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్) కుమారుడిగా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న విజయ్, తన స్వయంకృషితో పార్టీలో ఉన్నత స్థాయికి చేరారు. చంద్రబాబు, లోకేష్ మార్గదర్శకత్వంలో విధాన నిర్ణయాల్లో భాగస్వామి కావడానికి, రాజ్యసభ సభ్యత్వం వంటి ఉన్నత బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు.
Go Back to Shorts
Chinthakayala Vijay
TDP Rajya Sabha Candidate
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Nara Lokesh
Chinthakayala Ayyanna Patrudu

More Telugu News