ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? ఈ 4 జాగ్రత్తలు మీకోసమే!
- ప్రోటీన్ పౌడర్ వాడే ముందు నిపుణుల కీలక సూచనలు
- జీర్ణవ్యవస్థ, కిడ్నీ, లివర్ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి
- శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం
- వైద్యులను సంప్రదించకుండా సప్లిమెంట్లు మొదలుపెట్టవద్దు
- ముఖ్యంగా శాకాహారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
ముఖ్యంగా శాకాహారులు తమ ఆహారం ద్వారా తగినంత ప్రోటీన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు సప్లిమెంట్లపై ఆధారపడటానికి ముందు తమ శరీర యంత్రాంగం అందుకు సిద్ధంగా ఉందో లేదో చూసుకోవాలలి. ప్రోటీన్ పౌడర్ వాడకానికి ముందు నాలుగు కీలక అంశాలను తప్పక పరిశీలించుకోవాలి.
1. జీర్ణవ్యవస్థ: మీరు తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతోందా? మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే అదనపు ప్రోటీన్‌ను శరీరం తట్టుకోగలదు.
2. మూత్రపిండాల పనితీరు: గతంలో కిడ్నీలో రాళ్లు లేదా ఇతర సమస్యలు ఉన్నాయా? ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పెరుగుతుంది. కాబట్టి, వాడకానికి ముందు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
3. కాలేయ ఆరోగ్యం: ఫ్యాటీ లివర్ లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ముందుగా వాటికి చికిత్స తీసుకోవాలి. ఎందుకంటే, ప్రోటీన్‌లోని అమైనో ఆమ్లాలను విడగొట్టేది కాలేయమే.
4. శరీరంలో నీటి శాతం: ప్రోటీన్ జీవక్రియకు ఎక్కువ నీరు అవసరం. రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగకపోతే డీహైడ్రేషన్, కిడ్నీలపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి.
చాలామంది ఎలాంటి అవగాహన లేకుండానే సప్లిమెంట్లు మొదలుపెడుతున్నారని, దీనివల్ల సరైన ఫలితాలు రాకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రోటీన్ పౌడర్లలో హానికర లోహాలు, చక్కెరలు కూడా ఉండే అవకాశం ఉందని, వీలైనంత వరకు సహజ ఆహారం ద్వారా ప్రోటీన్ పొందడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. సప్లిమెంట్లు వాడాలనుకుంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.