సంప్రదాయం పేరుతో మారణహోమం.. ఒక్కరోజే 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల వధ!

Over 700 Whales and Dolphins Killed in Single Day in Faroe Islands Hunt
  • ఫారో దీవుల్లో తిమింగలాలు, డాల్ఫిన్ల వేట
  • సంప్రదాయ వేటలో భాగంగా సముద్ర జీవుల హననం
  • ఈ ఘటనతో సముద్ర తీరం రక్తసిక్తమైందని తెలిపిన పర్యావరణవేత్తలు
  • ఈ వేట అమానుషమంటూ అంతర్జాతీయంగా వెల్లువెత్తిన విమర్శలు
  • జంతు సంరక్షణ చట్టం నుంచి తిమింగలాలను మినహాయించాకే ఈ ఘటన
ఫారో దీవుల్లో సముద్ర జీవుల మారణహోమం తీవ్ర కలకలం రేపుతోంది. మే 27న ఒకేరోజు 700కు పైగా పైలట్ వేల్స్, డాల్ఫిన్లను అత్యంత దారుణంగా వేటాడారు. ఈ ఘటనతో సముద్ర తీర జలాలు రక్తసిక్తమయ్యాయి. ఈ ప్రాంతంలో ఇదొక సంప్రదాయ వేట. దీంతో ఈ వేటపై మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సీ షెపర్డ్ కన్జర్వేషన్ సొసైటీ నివేదికల ప్రకారం, మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ వేటలో మొత్తం 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను వధించారు. రాజధాని టోర్షావ్న్‌లోని సాండాగెర్డి బేలో 402 పైలట్ వేల్స్, నాలుగు బాటిల్‌నోస్ డాల్ఫిన్లను వేటాడారు. అదే రోజు స్కాలాఫ్జోర్డుర్‌లో 168 అట్లాంటిక్ వైట్-సైడెడ్ డాల్ఫిన్లను, హాల్విక్‌లో 132 వైట్ సైడెడ్ డాల్ఫిన్లను చంపేశారు. గత ఏడాది మొత్తం చంపిన జీవుల సంఖ్యలో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ ఈ ఒక్కరోజే వేటాడటం ఆందోళన కలిగిస్తోంది.

నార్త్ అట్లాంటిక్ సముద్రంలోని ఫారో దీవుల్లో శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయ వేటను నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పడవలను ఉపయోగించి తిమింగలాలు, డాల్ఫిన్లను తీరానికి మళ్లించి, వాటిని చంపి మాంసాన్ని స్థానికులు పంచుకుంటారు. అయితే, ఇటీవలే ఫారో పార్లమెంటు జంతు సంరక్షణ చట్టం నుంచి తిమింగలాలు, డాల్ఫిన్లను మినహాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఇంత పెద్ద ఎత్తున వేట జరగడం గమనార్హం.

ఓ సమయంలో వాటిని చంపేందుకు ఉపయోగించే ఆయుధాలు కొరత ఏర్పడటంతో కొక్కేలు, కత్తులు ఉపయోగించి వాటి శరీరాలను చీల్చారు. దీంతో అవి ఒడ్డున గిలగిల కొట్టుకుంటూ మృతి చెందాయి. సీ షెఫర్డ్‌లోని ఫారో దీవుల డైరెక్టర్ వాలంటీనా క్రాస్ట్ ఈ వేటను ఖండించారు. జంతువులను ఇంత క్రూరంగా హింసించి చంపడం సరికాదని అన్నారు. ఈ సంప్రదాయాన్ని నిషేదించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Over 700 Whales and Dolphins Killed in Single Day in Faroe Islands Hunt
Faroe Islands Hunt
Whales and Dolphins Killed

More Telugu News