గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఒక అభిమానిలా మారి థియేటర్‌లో సందడి చేశారు. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది' ప్రీమియర్ షోలో ఆమె అభిమానులతో కలిసి చేసిన హంగామా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జూన్ 3న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ఉపాసన సందడి చేశారు.

'పెద్ది' సినిమా ప్రీమియర్ షోను ఉపాసన తన తండ్రితో కలిసి చూశారు. తెరపై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ సీన్ రాగానే, అభిమానులతో పాటు ఉపాసన కూడా ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ కాగితపు ముక్కలను గాల్లోకి చల్లారు. అంతేకాకుండా, కిందపడిన కాగితాలను తీసి మళ్లీ చల్లుతూ సంబరాల్లో పూర్తిగా మునిగిపోయారు. భర్త సినిమాకు ఆమె చూపిన ఉత్సాహం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించారు. క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ వంటి అంశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం నేడు (జూన్ 4న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వృత్తిపరంగా రామ్ చరణ్ సాధిస్తున్న ప్రతి విజయం వెనుక ఉపాసన మద్దతు ఉంటుందని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.