జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ షరీఫ్

TDP leader MA Sharif slams YCP leadership
  • గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ
  • ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు
  • బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ
  • సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి
  • జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
వైసీపీ నాయకత్వంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వెన్నుపోట్లు, గొడ్డలి వేట్లు వైసీపీకి పేటెంట్లు అని, జగన్ తన 'జగనాసుర రక్తచరిత్ర'ను పక్కదారి పట్టించేందుకే 'ఫేక్ బుక్‌లెట్' పేరుతో కొత్త నాటకాలకు తెరతీశారని ఆయన మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలి వేటుతో హత్య చేసిన నిందితులను జగన్ వెనకేసుకొస్తున్నారని షరీఫ్ ఆరోపించారు. కే. శివశంకర్ స్థాపించిన వైసీపీని జగన్ కబ్జా చేశారని, సొంత తల్లికి, చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చలేదని, సంపూర్ణ మద్య నిషేధం పేరుతో కల్తీ మద్యాన్ని అమ్మి వేల కోట్లు దండుకున్నారని అన్నారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పలుమార్లు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపారని గుర్తు చేశారు.

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని షరీఫ్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామన్నారు. పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం-2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని వివరించారు. 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని భర్తీ చేయడంతో పాటు, మూతపడిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని తెలిపారు.

అమరావతిపై మూడు ముక్కలాట ఆడిన జగన్, ఇప్పుడు 'మావిగన్' అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని ఎద్దేవా చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారని, ఇప్పుడు జగన్ రెడ్డి ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరని షరీఫ్ స్పష్టం చేశారు.
Advertisement
Fake Booklet
MA Sharif
TDP
Jagan
YCP
Andhra Pradesh

More Telugu News