బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు

Over 700 employees left jobless as ThynkTech India CEO arrested
  • థింక్‌టెక్ ఇండియా సీఈఓ హర్షల్ ఠాక్రే అరెస్ట్
  • జనవరి నుంచి ఉద్యోగులకు జీతాల నిలిపివేత
  • లాప్‌టాప్‌ల పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణ
  • కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్
పూణెకు చెందిన ఐటీ సంస్థ ‘థింక్‌టెక్ ఇండియా’ తన కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసింది. దీంతో కంపెనీలో పనిచేస్తున్న 700 మందికి పైగా ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆఫీసులకు తాళాలు వేసి ఉండటం, కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు రావలసిన బకాయి జీతాలు, సెక్యూరిటీ డిపాజిట్లు ఇప్పించాలంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఈ పరిణామంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్థిక అక్రమాలు, మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కంపెనీ సీఈఓ హర్షల్ ఠాక్రేను పోలీసులు అరెస్ట్ చేశారు.

25 ఏళ్ల వయసున్న ఇంటర్న్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సంస్థ ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు. తర్వాత మరో 30 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్‌లు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. తమకు జీతాలు ఇవ్వలేదని, స్టైపెండ్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమ నుంచి వసూలు చేసిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు పేర్కొన్నారు.

నిజానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్‌లో ఈ కంపెనీని మూసివేసినట్లు ఉద్యోగులు తాజాగా పోలీసులకు తెలిపారు. ఎప్పటిలాగే ఆఫీసుకు వచ్చిన తమకు తాళాలు వేసి కనిపించాయని చెబుతున్నారు. కానీ, వాళ్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో మోసపోయామని తాజాగా గ్రహించారు. కంపెనీ ప్రతినిధులను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో సీఈఓతో పాటు కంపెనీ ట్రైనింగ్ హెడ్, హెచ్ఆర్ మేనేజర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారిక లాప్‌టాప్‌లు, ఇతర పరికరాల కోసం అంటూ ఉద్యోగులు, ఇంటర్న్‌ల నుంచి కంపెనీ సుమారు రూ.15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మొదట్లో జీతాలు, స్టైపెండ్‌లు సకాలంలో చెల్లించి ఉద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించారని బాధితులు అంటున్నారు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి జీతాల చెల్లింపులను పూర్తిగా నిలిపివేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కంపెనీకి సంబంధించిన మరికొన్ని ఆర్థిక రికార్డులను, లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
IT Compnay
ThynkTech India
ThynkTech India CEO

More Telugu News