ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్‌ మోదీ

If Govt wanted they could have got me a long time ago says Lalit Modi
  • పరారీలో ఉన్న వ్యక్తిగా అభివర్ణించడంపై లలిత్‌ మోదీ ఆగ్రహం
  • భారత్‌ లాంటి దేశం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని వాదన
  • ఎన్నికల ర్యాలీల్లో తన పేరు ప్రస్తావించడంపై మండిపాటు
  • రాజకీయ కారణాలతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
తాను దేశం విడిచి పారిపోయిన వ్యక్తిననే ప్రచారాన్ని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుకుంటే తనను ఎప్పుడో పట్టుకునేదని అభిప్రాయపడ్డారు. భారత్‌ లాంటి శక్తిమంతమైన దేశం కళ్లు గప్పి ప్రపంచమంతా తిరగడం అసాధ్యమని వాదించారు. తాను పారిపోతున్నట్లు మీడియానే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

దేశంలో తనపై ఉన్న కేసులను పూర్తిగా క్లియర్ చేసుకునేందుకు భారత్‌కు తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రుజువు చేసుకోవాలనే బలమైన కోరిక ఇప్పుడు తనలో లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలను తోసిపుచ్చారు. కేవలం రాజకీయ కారణాలతోనే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో, ఎన్నికల ర్యాలీలలో తన పేరును ప్రస్తావించడంపై మండిపడ్డారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ రాహుల్ గాంధీ తనపై విమర్శలు చేస్తున్నారని లలిత్ మోదీ పేర్కొన్నారు. క్రికెట్‌తో ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను వాడుకోవడానికే తన పేరును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. గత 2009లో ఐపీఎల్ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు మార్చడం వెనుక ఉన్న కథను వివరించారు. అప్పటి హోం మంత్రి చిదంబరం తనను బెదిరించారని, కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. అప్పట్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు మ్యాచ్‌లకు అనుమతి ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరాకరించాయని తెలిపారు. చిదంబరం ఆదేశాల వల్లే టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం షెడ్యూల్‌ను 154 సార్లు మార్చాల్సి వచ్చిందని వివరించారు.
Go Back to Shorts
Lalit Modi
Rahul Gandhi
IPL
Chidambaram
Economic fugitive India
Cricket

More Telugu News