అమరావతి స్మార్ట్ సిటీకి భాగస్వామ్యం.. రష్యా 'ఎలిమెంట్ గ్రూప్'కు నారా లోకేష్ ఆఫర్
- రష్యా సెమీకండక్టర్ దిగ్గజం ఎలిమెంట్ గ్రూప్‌తో మంత్రి లోకేష్ భేటీ
- విశాఖ, నెల్లూరు, శ్రీసిటీలలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
- సెమీకండక్టర్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం
- ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎలిమెంట్ గ్రూప్
- అంతర్గత చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన
ఈ సమావేశంలో ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్, ఇతర డైరెక్టర్లతో భేటీ అయిన మంత్రి లోకేష్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారీ, డిజైన్ యూనిట్లను స్థాపించాలని ఆహ్వానించారు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ రవాణా, బ్యాంకింగ్ వ్యవస్థలకు అవసరమైన ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు, స్మార్ట్ కార్డ్ మైక్రోచిప్‌ల తయారీ కోసం విశాఖపట్నంలో ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, దేశీయంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), సోలార్ కన్వర్టర్ల మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో సెమీకండక్టర్ పరికరాల తయారీ యూనిట్‌ను స్థాపించాలని ప్రతిపాదించారు.
ఇప్పటికే శ్రీసిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆటోమోటివ్, అసెంబ్లింగ్ పరిశ్రమలకు రోబోటిక్స్, ఆటోమేషన్ సేవలు అందించేందుకు ఎలిమెంట్ గ్రూప్ తమ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ సూచించారు. దీనికి తోడు, కమ్యూనికేషన్, ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన మాడ్యులర్ కాంపోనెంట్లపై దృష్టి సారిస్తూ వైజాగ్ హై-టెక్ కారిడార్‌లో ఒక మైక్రోఎలక్ట్రానిక్స్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగంగా హార్డ్‌వేర్, ఐఓటీ మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని, ఇందుకు అవసరమైన మైక్రోకంట్రోలర్లు, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరఫరా చేయాలని కోరారు.
మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్ ఒలెగ్ సానుకూలంగా స్పందించారు. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని, ఇప్పటికే భారత టెక్ సంస్థలతో కలిసి సెమీకండక్టర్ పంపిణీ నెట్‌వర్క్‌లను నడుపుతున్నట్లు వివరించారు. దక్షిణాసియా మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో ఈ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి, త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.
మాస్కో కేంద్రంగా 2019లో ఏర్పాటైన ఎలిమెంట్ గ్రూప్, రష్యాలో అగ్రగామి సెమీకండక్టర్ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థకు 30కి పైగా డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఉండగా, 9 వేల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సుమారు రూ. 5,090 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ భేటీతో ఏపీకి సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
