సముద్ర గర్భంలో సిగ్నల్స్.. సబ్‌మెరైన్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

How Submarines receive signals thousands of feet deep in the ocean
  • సముద్రపు నీటిలో పనిచేయని సాధారణ రేడియో తరంగాలు
  • లోతులోకి వెళ్లడానికి వీఎల్‌ఎఫ్‌, ఈఎల్‌ఎఫ్‌ తరంగాల వాడకం
  • ఈ తరంగాల ద్వారా డేటా స్పీడ్ తక్కువ
  • భారీ డేటా సకోసం శాటిలైట్ కనెక్టివిటీ తప్పదు
  • సబ్‌మెరైన్లలో సోనార్ టెక్నాలజీని వాడతారు
దేశ రక్షణలో జలాంతర్గాములు చాలా కీలకం. ఇవి సముద్రంలో వేల అడుగుల లోతున నెలకు పైగా ప్రయాణించగలవు. అయితే భూమిపైనే మన మొబైల్ సిగ్నల్స్ సరిగా అందనప్పుడు, అంత లోతులో ఇవి తమ బేస్ క్యాంపులతో ఎలా కమ్యూనికేట్ అవుతాయనేది ఆసక్తికరమైన విషయం. పైగా సముద్రపు నీటిలో సాధారణ రేడియో తరంగాలు పనిచేయవు. అందుకే సబ్‌మెరైన్ల కోసం సైంటిస్టులు ఎంతో అధునాతన సాంకేతికతను వాడుతున్నారు.

నీటిలో సిగ్నల్స్ ఎందుకు పనిచేయవు?
మనం వాడే మొబైల్ ఫోన్లు, వైర్‌లెస్ పరికరాలు హై-ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలతో పనిచేస్తాయి. అయితే సముద్రపు ఉప్పు నీటికి విద్యుత్ వాహకత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణ రేడియో తరంగాలు నీటిలోకి వెళ్లిన కొన్ని మీటర్ల లోతులోనే పూర్తిగా బలహీనపడిపోతాయి. అందుకే సముద్ర గర్భంలో సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయవు.

ప్రత్యేక తరంగాలతో కమ్యూనికేషన్
సముద్రంలో వేల అడుగుల లోతుకు సిగ్నల్స్ పంపడానికి ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ (వీఎల్‌ఎఫ్‌), ‘ఎక్స్‌ట్రీమ్‌లీ లో ఫ్రీక్వెన్సీ’ (ఈఎల్‌ఎఫ్‌) తరంగాలను వాడతారు. ఈ తరంగాలకు సముద్రపు నీటిని చీల్చుకుంటూ లోపలికి వెళ్లే అద్భుతమైన సామర్థ్యం ఉంటుంది. కానీ వీటి ద్వారా డేటాను పంపే వేగం చాలా తక్కువగా ఉంటుంది. వీటి సాయంతో కేవలం చిన్న టెక్స్ట్ మెసేజ్‌లు లేదా అత్యవసర ఆదేశాలను మాత్రమే పంపగలరు.

పెద్ద డేటా కోసం పైకి రాక తప్పదు
సబ్‌మెరైన్లకు పెద్ద మొత్తంలో సమాచారం, వీడియోలు లేదా ఫైల్స్ పంపాల్సి వచ్చినప్పుడు అవి సముద్రం పైభాగానికి వస్తాయి. అలా వచ్చినప్పుడు తమ వద్ద ఉన్న ప్రత్యేకమైన యాంటెన్నాను పైకి లేపుతాయి. దీని ద్వారా నేరుగా మిలిటరీ శాటిలైట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతాయి. అప్పుడు హెడ్‌క్వార్టర్స్‌తో అత్యంత వేగంగా డేటాను మార్పిడి చేసుకుంటాయి.

సోనార్ టెక్నాలజీ వినియోగం
నీటిలో రేడియో తరంగాల కంటే శబ్ద తరంగాలు చాలా వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందుకే సబ్‌మెరైన్లు ‘సోనార్’ టెక్నాలజీని వాడతాయి. సాధారణంగా సోనార్‌ను శత్రువుల నౌకలను, సముద్రంలోని అడ్డంకులను గుర్తించడానికి వాడినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీని ద్వారా ఒకరికొకరు శబ్ద సంకేతాల రూపంలో సమాచారాన్ని కూడా పంపుకొంటారు.
Go Back to Shorts
Submarines
Signals
Radio Signals
Sonar
Low Frequency Signals

More Telugu News