పవన్‌పై వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. తెలంగాణ నేతలకు చంద్రబాబు హితవు
- తెలంగాణలో పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు
- విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు
- రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లయ్యాక అనవసర వివాదాలు తగదు
- అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలని రాజకీయ నాయకులకు పిలుపు
తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. ఇలాంటి మాటలతో అనవసర సమస్యలు సృష్టించవద్దని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించవని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తన యూనిట్‌ను ఏర్పాటు చేసుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. అప్పుడు ఏపీలో ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 12 ఏళ్లు దాటిపోయిందని.. ఈ సుదీర్ఘ కాలంలో ఎవరెవరు ఏం చేశారనేది రెండు రాష్ట్రాల ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఏవైనా సమస్యలు లేదా భేదాభిప్రాయాలు ఉంటే రాజకీయంగా, లాజికల్‌గా ముందుకెళ్లాలి తప్ప.. ఇలాంటి వ్యాఖ్యలతో రాష్ట్రాల్లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని సూచించారు.
"తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిపై కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదు. ఇలాంటి మాటలు మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించకూడదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇప్పుడు అనవసరంగా మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. ఏ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసు.
నేను ఇటీవలే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చాను. అక్కడకు కర్ణాటకతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నేతలు వచ్చారు. కర్ణాటక నుంచి డీకే శివకుమార్ కూడా వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరిస్తామని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది సరైన విధానం కాదు.
ఈ రోజు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో ఎంతోమంది తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో మనవాళ్లు పదవులు చేపట్టి, అక్కడి రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారు. ప్రజలకు ఎవరు మంచి సేవ చేస్తే వారే ఆయా ప్రాంతాల్లో నాయకులు అవుతారు.
రాజకీయ నాయకులు అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టాలి. అంతేకానీ ఇలాంటి విమర్శలతో ప్రజల మధ్య దూరం పెంచకూడదు" అని చంద్రబాబు హితవు పలికారు.