ఈ తిమింగలాన్ని రక్షించడానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ,
- ఇటీవల వార్తల్లో నిలిచిన ‘తిమ్మీ’ తిమింగలం
- పొరపాటున అట్లాంటిక్ మహాసముద్రం నుంచి బాల్టిక్ సముద్రంలోకి
- ఉప్పు శాతం తక్కువ, లోతు తక్కువ ఉండడంతో అనారోగ్యం
- రూ.13 కోట్లు ఖర్చు చేసి తరలించినా దక్కని ప్రాణం
సముద్రం దాటి వచ్చి
సాధారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఈ హంప్‌బ్యాక్ తిమింగలం ఈ ఏడాది మార్చి నెలలో పొరపాటున ‘బాల్టిక్ సముద్రం’లోకి ప్రవేశించింది. చేపల వేటలో దారి తప్పి రావడం లేదా నౌకల శబ్దాల వల్ల దిక్కుతోచక ఇటువైపు వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాల్టిక్ సముద్రంలో ఉప్పు శాతం తక్కువగా ఉండటం వల్ల తిమ్మీ తీవ్రమైన చర్మ వ్యాధి బారిన పడింది. అంతేకాకుండా అక్కడి లోతు తక్కువ తీర ప్రాంతాల్లో ఇసుక తిన్నెలపై పదే పదే చిక్కుకుంటూ పూర్తిగా బలహీనపడింది.
భారీ రెస్క్యూ ఆపరేషన్
సుమారు 40 అడుగుల పొడవు, 12 టన్నుల బరువున్న ఈ తిమింగలాన్ని కాపాడటానికి జర్మనీలో ఊహించని స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు వెనకడుగు వేసినా జంతు ప్రేమికులు, ప్రైవేట్ దాతలు భారీగా నిధులు సమకూర్చారు. ఈ ఆపరేషన్ కోసం ఏకంగా 1.5 మిలియన్ యూరోలు (సుమారు రూ.13.5 కోట్లు) ఖర్చు చేశారు. ఒక భారీ వస్తురవాణా బోటుని నీటితో నింపి అందులోకి తిమ్మీని చేర్చారు. మే 2వ తేదీన బాల్టిక్ సముద్రం నుంచి సురక్షితంగా ‘ఉత్తర సముద్రం’ (North Sea)లోకి వదిలారు. ఈ అసాధారణ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది లైవ్ స్ట్రీమ్ ద్వారా ఉత్కంఠగా వీక్షించారు.
విషాదాంతం
కానీ ఉత్తర సముద్రంలోకి వెళ్లిన కొన్ని రోజులకే తిమ్మీ మరణించింది. డెన్మార్క్ శాస్త్రవేత్తలు దాని శరీరానికి అమర్చిన ట్రాకింగ్ డివైజ్ ద్వారా అది ‘తిమ్మీ’నే అని ధ్రువీకరించారు. ప్రస్తుతం దాని కళేబరాన్ని తీరానికి చేర్చి మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తున్నారు. తిమ్మీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను తీవ్రంగా కలిచివేసింది.