రాయదుర్గంలో రియల్ భూమ్.. ఎకరానికి రూ.204 కోట్లు!
- టీజీఐఐసీ ఈ-వేలంలో 5.09 ఎకరాలు దక్కించుకున్న వంశీరామ్ బిల్డర్స్
- ఈ ఒక్క అమ్మకంతో ప్రభుత్వానికి సుమారు రూ.1,040 కోట్ల ఆదాయం
- ఇటీవలి రెండు వేలాలతో కలిపి ఖజానాకు చేరిన రూ.2,500 కోట్లు
రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 5.09 ఎకరాల ప్లాట్‌ను టీజీఐఐసీ ఈ-వేలంలో ఉంచింది. ఇందులో ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్ బిల్డర్స్ ఎకరాకు రూ.204 కోట్ల చొప్పున, మొత్తం సుమారు రూ.1,040 కోట్లకు ఈ భూమిని దక్కించుకుంది. ఈ ప్లాట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర ఎకరానికి రూ.139 కోట్లు కాగా, దాని కంటే 46.8 శాతం అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం.
ఇటీవల ఇదే ప్రాంతంలో 6.29 ఎకరాల భూమిని గౌరా వెంచర్స్ సంస్థ ఎకరాకు రూ.237 కోట్ల చొప్పున సుమారు రూ.1,490 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన వేలంతో కలిపి, ఈ రెండు ప్లాట్ల (మొత్తం 11.38 ఎకరాలు) అమ్మకం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.2,529 కోట్ల ఆదాయం వచ్చినట్లయింది.
హైదరాబాద్ ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీకి సమీపంలో ఉండటంతో రాయదుర్గం భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వరుసగా నమోదవుతున్న ఈ రికార్డు ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై పెట్టుబడిదారులకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయి. వేలానికి అసాధారణ స్పందన లభించిందని, పోటీ తీవ్రంగా ఉండటంతోనే ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలికిందని టీజీఐఐసీ అధికారులు తెలిపారు.