పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్!

Pawan Kalyan targets tax evaders industries educational institutions
  • గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ దృష్టి
  • పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ప్రశ్న
  • పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం, క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీలకు చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్న భారీ పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రంగాల నుంచి పేరుకుపోయిన పన్ను బకాయిలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య పౌరులు తమ పన్నులను క్రమబద్ధంగా చెల్లిస్తున్నప్పుడు.. పెద్ద పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తమ బాధ్యతలను ఎందుకు విస్మరిస్తున్నాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. "సాధారణ ప్రజలు ఎంతో నిజాయతీగా పన్నులు కడుతున్నారు. మరి పరిశ్రమలు, ప్రైవేట్ విద్యాసంస్థలు పంచాయతీలకు చెల్లింపులు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాయి? ఎందుకు ఎగవేస్తున్నాయి?" అని పవన్ నిలదీశారు.


పన్నుల రికవరీ ప్రక్రియలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఉపముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. సదరు సంస్థల నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని పన్నులను పూర్తిగా రికవరీ చేయడానికి కఠినమైన విధానాన్ని అవలంబించాలని అధికారులను ఆదేశించారు. వసూళ్ల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించని డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలపై తక్షణమే అవసరమైన చట్టపరమైన చర్యలను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Pawan Kalyan taxes
tax evasion
private schools
industries
Grama Panchayats
tax collection
Panchayat Raj
local governance

More Telugu News