నా హీరో తర్వాత సెల్ఫీ అడిగింది నిన్నే.. వైభవ్ పై లాంగర్ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!

Justin Langer Asks for Selfie with Vaibhav Suryavanshi After Hero
  • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో సెల్ఫీ దిగిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్
  • తన జీవితంలో ఒక అథ్లెట్‌తో సెల్ఫీ అడగడం ఇది రెండోసారేనని వెల్లడి
  • ఈ కుర్రాడి ప్రతిభను మునుపెన్నడూ చూడలేదంటూ లింక్డ్‌ఇన్‌లో లాంగర్ పోస్ట్
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఫిదా అయ్యాడు. వైభవ్ ఆటతీరు చూసి ఎంతగానో ముగ్ధుడైన లాంగర్, స్వయంగా అతని వద్దకు వెళ్లి ఒక సెల్ఫీ అడిగాడు. తన సుదీర్ఘ క్రీడా జీవితంలో ఒక అథ్లెట్‌ను సెల్ఫీ అడగడం ఇది కేవలం రెండోసారి మాత్రమేనని లాంగర్ వెల్లడించడం ఈ సంఘటన ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌కు లాంగర్ మంత్రముగ్ధుడయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 65 సిక్సర్లు బాదిన వైభవ్, ఒకే టీ20 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59) రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగానూ వైభవ్ రికార్డు సృష్టించాడు.

ఈ నేపథ్యంలో లాంగర్ తన లింక్డ్‌ఇన్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "గతవారం నా జీవితంలో నేను రెండోసారి చేసిన పని ఒకటి చేశాను. ఒక అథ్లెట్‌ను సెల్ఫీ అడిగాను. మొదటిసారి రెండేళ్ల క్రితం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో నా చిన్ననాటి హీరో, ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ (ఏఎఫ్ఎల్‌) లెజెండ్ స్టీఫెన్ మైఖేల్‌ను అడిగాను. ఇక రెండోసారి, బిహార్‌లోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల కుర్రాడిని అడిగాను" అని లాంగర్ పేర్కొన్నాడు.

"వైభవ్ సూర్యవంశీ మా లక్నో జట్టుపై గ్రౌండ్‌లోని అన్ని మూలలకు బంతిని బాదాడు. 35 ఏళ్లుగా నేను ఈ ఆటలో ఉన్నాను. కానీ ఈ కుర్రాడు ఆడే తీరును నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ఆటగాడిని నేను మునుపెన్నడూ చూడలేదు. ప్లేఆఫ్ ఫైనల్‌లోనూ అతను మళ్లీ అదే చేశాడు. అతని ఆట చూశాక 'ప్రతిభ' అనే పదం గురించి ఆలోచనలో పడ్డాను" అని లాంగర్ తన పోస్టులో రాశాడు. వైభవ్ ప్రతిభను వివరిస్తూ..  ఏఎఫ్ఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (433) ఆడిన స్కాట్ పెండిల్‌బరీతో పోల్చారు. ఒకరు కెరీర్ ఆరంభంలో, మరొకరు ముగింపులో ఉన్నప్పటికీ ఇద్దరూ తమ తమ క్రీడల్లో ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో వివరించాడు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Justin Langer
Lucknow Super Giants
IPL
T20 cricket
Chris Gayle
Rajasthan Royals
Cricket
AFL
Stephen Michael

More Telugu News