టీడీపీ పుట్టకముందు ముస్లింలకు రాజకీయ గుర్తింపు ఎక్కడుంది?: నజీర్ అహ్మద్

Nazeer Ahmed questions Muslim political recognition before TDP
  • టీడీపీ వల్లే ముస్లింలకు రాజకీయ గుర్తింపు లభించిందన్న నజీర్ అహ్మద్
  • మైనార్టీ సంక్షేమ బడ్జెట్‌ను రూ. 6,090 కోట్లకు పెంచిన కూటమి ప్రభుత్వం
  • వక్ఫ్ బోర్డు ఆస్తులను పకడ్బందీగా కాపాడుతున్నామని వెల్లడి
  • నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాం
  • హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ఆర్థిక సహాయం
  • టీడీపీ మహానాడులో నజీర్ అహ్మద్ ప్రసంగం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయ గుర్తింపు ఎక్కడ ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన అన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహానాడు–2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఎంతో మంది మైనార్టీ సోదరులను చేరదీసి, వారికి రాజకీయ జీవితాన్ని, ఉన్నత పదవులను కల్పించిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు.

మైనార్టీల సంక్షేమం విషయంలో తమ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని నజీర్ అహ్మద్ వివరించారు. 2025-26 బడ్జెట్‌లో మైనార్టీల కోసం రూ. 5,334 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది (2026-27) బడ్జెట్‌లో ఆ కేటాయింపులను ఏకంగా రూ. 6,090 కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం జీవో 47 అడ్డుపెట్టుకుని వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేయాలని చూస్తే, తమ ప్రభుత్వం ఆ ఆస్తులను పకడ్బందీగా కాపాడుతోందని తెలిపారు. వైసీపీ హయాంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన కడప హౌస్ అభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయించి, నేడు సర్వాంగ సుందరంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేశామని చెప్పారు.

విద్య, సాంస్కృతిక రంగాల్లోనూ మైనార్టీలకు అండగా నిలుస్తున్నామని నజీర్ అహ్మద్ అన్నారు. గత ప్రభుత్వం ఉర్దూ అకాడమీకి కేవలం రూ. 2.5 కోట్లు విదిలిస్తే, తమ కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ. 10 కోట్లు మంజూరు చేసి ఉర్దూ భాషను గౌరవించిందన్నారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా గత ప్రభుత్వంలా కాకుండా, ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. దాదాపు 4.5 లక్షల మంది మైనార్టీ విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తింపజేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.38 లక్షల మంది ముస్లిం అవ్వాతాతలకు పింఛన్ల రూపంలో ఏడాదికి రూ. 3,511 కోట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మైనార్టీల సంస్కృతిని గౌరవించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని నజీర్ అహ్మద్ అన్నారు. నెల్లూరు బారా షాహీద్ రొట్టెల పండుగకు రూ. 10 కోట్లు విడుదల చేయడమే కాకుండా, దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించామన్నారు. తెలుగుదేశం హయాంలో 342 షాదీ ఖానాలు నిర్మిస్తే, వైసీపీ ఐదేళ్లలో కేవలం రెండు మాత్రమే నిర్మించిందని విమర్శించారు. వెనుకబడిన నూర్ బాషా/దూదేకుల కులస్థుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది 2,001 మంది యాత్రికులను ప్రభుత్వ ఖర్చులతో పవిత్ర హజ్ యాత్రకు పంపించామని, యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మైనార్టీల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Nazeer Ahmed
TDP
Telugu Desam Party
Chandrababu Naidu
Muslim minorities
Andhra Pradesh politics
Minority welfare schemes
Urdu Academy
Haj Yatra
Shaadi Khanas

More Telugu News