మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy Letter to Maharashtra CM on Tummadihatti Barrage
  • తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి
  • చర్చల కోసం సమయమివ్వాలని లేఖలో విజ్ఞప్తి
  • ఎఫ్ఆర్ఎల్ పెరిగినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువ ఉంటుందని వెల్లడి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. చర్చల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు సమయం ఇవ్వాలని, సమావేశానికి తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో అంగీకరించిందని గుర్తు చేశారు. కానీ దీంతో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు తీరవని పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఎల్ పెరిగితేనే గ్రావిటీ ద్వారా తెలంగాణకు నీళ్లు వస్తాయని తెలిపారు. ఎఫ్ఆర్ఎల్ పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు.

కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా భేటీ అయ్యారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు కీలక అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం అమలుకు సంబంధిత ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల వేగవంతం తదితర అంశాలపై చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్ వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసేందుకు స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై వారు చర్చించారు. తెలంగాణ విజ్ఞప్తులపై సింధియా సానుకూలంగా స్పందించారు. కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Maharashtra
Devendra Fadnavis
Tummadihatti Barrage
Jyotiraditya Scindia

More Telugu News