ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్

  • రాజమండ్రిలో జనసేన క్యాడర్ తో పవన్ సమావేశం
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన 
  • పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆగ్రహం
  • ఇక ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ
రాజమండ్రిలో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా, ఆవేశంగా ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని, ప్రజలకు సేవ చేసేందుకేనని పునరుద్ఘాటించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కరెంట్, రోడ్లు లేని మారుమూల గ్రామానికి ఆ సౌకర్యాలు కల్పించినప్పుడు కలిగే సంతృప్తి, ఆస్కార్ అవార్డు కంటే గొప్పదని అన్నారు. డోలీ మోతలతో ప్రాణాలు కోల్పోతున్న గిరిజనులకు రోడ్డు వేయగలిగితే అది ప్రపంచ స్థాయి గుర్తింపు కంటే ఎక్కువ తృప్తినిస్తుందన్నారు. 

"భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి త్యాగధనుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. వారికి ఏ పదవులు ఉన్నాయి? దేశం కోసం వారు చేసిన త్యాగమే వారిని ప్రజల గుండెల్లో నిలిపింది. అలాంటి స్ఫూర్తితోనే నేను పనిచేస్తున్నాను" అని పవన్ వ్యాఖ్యానించారు.

ఆ రాజకీయ విశ్లేషకుడు అంటే నాకు గౌరవం ఉంది.. కానీ..!

ఇటీవల రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుకుంటున్నప్పుడు వైసీపీ నాయకుడిని (జగన్ ను) అరెస్ట్ చేయాలని కోరినట్లు, దానికి అమిత్ షా తనపై క్లాస్ తీసుకున్నట్లు ఆ విశ్లేషకుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

"ఆ రాజకీయ విశ్లేషకుడు అంటే నాకు గౌరవం ఉంది. కానీ విశ్లేషణ వేరు, వదంతులు వేరు. విశ్లేషకులు వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి తప్ప, ఎవరో చెప్పారని విని మాట్లాడకూడదు. సర్దార్ పటేల్ తర్వాత అంతటి దృఢమైన హోంమంత్రి అమిత్ షా. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి గురించి తేలికగా మాట్లాడటం సరికాదు. ఒకవేళ నేరం జరిగితే చట్టం తనపని తాను చేసుకుపోతుంది. కోర్టులు, వ్యవస్థలు ఉన్నాయి. వాళ్లను జైల్లో పెట్టండి, వీళ్లను బయటకు తీయండి అని చెప్పడానికి నేనెవడిని? అలాంటి మాటలు మాట్లాడటం వ్యవస్థను అవమానించడమే. అయినా అదేం లాజిక్కో నాకు అర్థం కావడం లేదు. జగన్ ను జైల్లో పెడితే నేను సీఎం అవుతానా?" అని పవన్ మండిపడ్డారు.

లోపలున్న వాడే తలుపు తీయాలి!

పార్టీలో నెలకొన్న అనైక్యత, అంతర్గత విభేదాలపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేశారు. బయటి శత్రువు దాడి చేయాలంటే లోపలున్న వాడే తలుపు తీయాలని, జనసేనలో కూడా అదే జరుగుతోందని వాపోయారు. "తమిళనాడులో ఒక హీరోని అభిమానిస్తే, అతని కోసం అభిమానులంతా ఏకతాటిపై నిలబడి సీఎంను చేశారు. కానీ ఇక్కడ నా అభిమానులు కూడా పాలిటిక్స్ అనగానే కులాలుగా, పార్టీలుగా విడిపోతున్నారు. పార్టీలోని కొందరు నాయకులే టీవీ ఛానెళ్లకు లీకులు ఇస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేద్దామంటే మనవాళ్లే రెండు అడుగులు వెనక్కి లాగుతున్నారు. ఈ పరిస్థితి మారాలి" అని ఆయన అన్నారు.

సహనానికి కాలం చెల్లింది.. ఇక నేనేంటో చూపిస్తా!

గడిచిన 12 ఏళ్లుగా ఎన్నో అవమానాలు, విమర్శలు భరించానని, పార్టీ శ్రేణుల కోసం ఎంతో సహనంగా ఉన్నానని, కానీ ఇకపై ఆ సహనం ఉండదని పవన్ తేల్చిచెప్పారు. "నా మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. భరించాను, సహించాను, అవసరమైతే తాట తీస్తానని గతంలోనే చెప్పాను. అది సినిమా డైలాగ్ కాదు, నాలోని సగటు మనిషి ఆవేదన. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే, దాడి చేస్తే నవ్వుతూ భరించడానికి నేను సిద్ధంగా లేను. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఇకపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయి" అని గట్టిగా హెచ్చరించారు.

పార్టీ ప్రక్షాళనకు పక్కా ప్రణాళిక.. ఆగస్టు 14 డెడ్‌లైన్

పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పవన్ ప్రకటించారు. "రాబోయే రోజుల్లో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేక కమిటీలను పంపుతున్నాను. వీరు నాయకులను ఎంపిక చేయరు, క్షేత్రస్థాయిలో పనిచేసిన నిజమైన కార్యకర్తలు, సాధక్స్‌ను గుర్తిస్తారు. ప్రతి నియోజకవర్గంలో పనిచేసే వారి జాబితాను సిద్ధం చేస్తారు. నా లక్ష్యం ఒక్కటే.. ఆగస్టు 14 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మన పార్టీ కార్యవర్గం జెండా ఎగురవేయాలి. అంత పటిష్ఠంగా పార్టీని నిర్మించబోతున్నాను. వ్యూహం నేను రచిస్తాను, మీరు ఆచరించండి. ఇకపై నన్ను ప్రశ్నించవద్దు. సేనానిగా నేను చెప్పింది వినండి" అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతా.. అది నా నైజం

తన రాజకీయ నైతికతను వివరిస్తూ, శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు దాడి చేయడం తన నైజం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. "ఒకరు జైల్లో ఉన్నప్పుడు మనం బలపడదామని నేను అనుకోను. అదే నిజమైతే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయిపోవచ్చని అనుకోవాలి కదా! నా విలువలు అలాంటివి కావు. శత్రువు బలంగా ఉన్నప్పుడే నేను పోరాడతాను, బలంగానే కొడతాను. అంతేగానీ, బలహీనంగా ఉన్నప్పుడు దెబ్బతీయను. అందరూ ఆరోగ్యంగా, బలంగా ఉండండి, అప్పుడు తలపడదాం. నీ సామర్థ్యం ఎంత వరకు ఉందో అంత యుద్ధం చేస్తాను... అది ఆ నైజం" అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, జనసేన బలాన్ని బలంగా ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.

Pawan Kalyan
Janasena
Professor Nageshwar
Andhra Pradesh Politics
Amit Shah
రాజమండ్రి
Political Analysis
YCP
Internal Conflicts
Party Discipline

More Telugu News