టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రువాండా ఆటగాడు హంజా ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 65 బంతుల్లో అజేయంగా 164 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో పురుషుల టీ20 ఫార్మాట్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసి, చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఆదివారం నాడు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా సబ్-రీజనల్ క్వాలిఫయర్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది.

హంజా ఖాన్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 252.30గా నమోదైంది. ఈ ఇన్నింగ్స్‌తో అతను 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ చేసిన 162 పరుగుల రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ నెంబర్ వన్ గా ఉన్నాడు. 2018లో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ 172 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఫించ్ తర్వాత రెండో స్థానంలో హంజా ఖాన్ నిలిచాడు.

హంజా ఖాన్ అద్భుత బ్యాటింగ్‌తో రువాండా జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 చరిత్రలో ఏడో అత్యధిక జట్టు స్కోరు కావడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐవరీ కోస్ట్ జట్టు, రువాండా బౌలర్ల ధాటికి కేవలం 17 పరుగులకే కుప్పకూలింది. ఇది టీ20ల్లో ఐదో అత్యల్ప స్కోరు.

దీంతో రువాండా జట్టు 271 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా ఇది మూడో అతిపెద్ద విజయం. ఈ ఒక్క మ్యాచ్‌తో రువాండా క్రికెట్‌తో పాటు హంజా ఖాన్ పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.